Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రాయుడు

సినిమా రివ్యూ: రాయుడు

రివ్యూ: రాయుడు
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌
తారాగణం: విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, కులప్పుల్లి లీల, ఆర్‌.కె. సురేష్‌, సూరి తదితరులు
సంగీతం: డి. ఇమ్మాన్‌
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
ఛాయాగ్రహణం: వేల్‌రాజ్‌
నిర్మాతలు: విశాల్‌, జి. హరి
రచన, దర్శకత్వం: ముత్తయ్య
విడుదల తేదీ: మే 27, 2016

చాలా కాలం తర్వాత విశాల్‌ పూర్తి స్థాయి మాస్‌ సినిమాలో కనిపించాడు. ఇటీవల ఎక్కువగా థ్రిల్లర్‌ కథలని నమ్ముకుంటోన్న విశాల్‌ ఈసారి పరిపూర్ణమైన మాస్‌ సినిమాని ఎంచుకున్నాడు. ముత్తయ్య తెరకెక్కించిన 'మరుదు' తమిళంలో మాస్‌ ప్రేక్షకుల మన్ననలని అందుకుంటోంది. మన మాస్‌ కూడా ఆదరిస్తారనే ఆశతో 'రాయుడు' పేరిట అనువదించిన ఈ చిత్రం మన అభిరుచికి, మన సెన్సిబులిటీస్‌కి ఆమడ దూరంలో ఉంది. పూర్తిగా తమిళనాడు రూరల్‌ మాస్‌ని దృష్టిలో ఉంచుకుని తీసినట్టున్న ఈ సినిమాలో ఆకట్టుకునే యాక్షన్‌ సన్నివేశాలు, ఉన్నతమైన సాంకేతిక విలువలైతే ఉన్నాయి కానీ మరీ ఇంతటి అరవ ఊర నాటు చిత్రాన్ని భరించడం మనవల్ల కాదు. 

కథాపరంగా రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ చేసిన ఒక సాధారణ రివెంజ్‌ డ్రామా. హీరో, విలన్‌ మధ్య డైరెక్ట్‌ కాన్‌ఫ్రంటేషన్‌ లేకపోవడంతో రెండు పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ పెట్టుకుని కూడా ఏమాత్రం రుచించని ఫ్యామిలీ డ్రామాతో కాలక్షేపం చేసుకోవాల్సి వచ్చింది. విశాల్‌, శ్రీదివ్య మధ్య జరిగే లవ్‌ ట్రాక్‌ మొత్తం 'బోర్‌' స్పెల్లింగ్‌ని బలపం అరిగే వరకు దిద్దిస్తుంది. అసలే విసిగించే ఈ లవ్‌ ట్రాక్‌కి, 'మంగమ్మ గారి మనవడు' సెంటిమెంట్‌ ఒకటి గుదిబండలా మారింది. లీల, విశాల్‌ మధ్య అనుబంధాన్ని, వారి మధ్య జరిగే కామెడీని భరించడం సామాన్యుల వల్లయితే కాదు. తమిళ రూరల్‌ నేపథ్యానికి తగ్గట్టుగా ఉండాలనో ఏమో ప్రధాన పాత్రధారులైన విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి తప్పిస్తే మిగిలిన పాత్రలన్నీ మనకి అంతగా పరిచయం లేని వారితో చేయించారు. దీని వల్ల అసలే నేటివిటీ సమస్య ఉన్న ఈ చిత్రానికి 'కనెక్టివిటీ' సమస్య కూడా ఏర్పడింది. విశాల్‌ బామ్మ పాత్రతో కానీ, శ్రీదివ్య తల్లి పాత్రతో కానీ అస్సలు రిలేట్‌ చేసుకోలేం. కనీసం కాస్త తెలిసిన ఆర్టిస్టులున్నా కొంచెమైనా కనెక్ట్‌ అయ్యేవాళ్లమేమో. 

మూటలు మోసే మాస్‌ హీరో, మనుషుల్ని చంపి ముక్కలు చేసే విలన్‌ పాత్రలు పెట్టుకుని వారిమధ్య సంఘర్షణకి చివరి రీల్‌ వరకు వేచి చూడడం సబబు అనిపించదు. కనీసం మధ్యలో వచ్చే లవ్‌, సెంటిమెంట్‌ అయినా కాస్త ఆకర్షణీయంగా ఉండుంటే బాగుండేది. సినిమా మొత్తానికి ఇంటర్వెల్‌ సీన్‌, క్లయిమాక్స్‌ మాత్రమే మెప్పిస్తాయి. మిగిలిందంతా వాటి కోసం ఎదురు చూపులు చూడ్డానికే తప్ప ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండదు. 

కనీసం చకచకా వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో పరుగులు పెట్టించినా పోయేది. కానీ ప్రతి సీన్‌లోను దర్శకుడు కట్‌ చెప్పకపోతే పోయాడు, ఎడిటర్‌ అయితే కత్తెర వాడి ఉండొచ్చుగా అనిపిస్తుంటుంది. ఎవరైనా మాట్లాడ్డం మొదలు పెడితే అదే పనిగా వస బ్యాచ్‌లా నస పెట్టేస్తుంటారు. చివర్లో ఏం జరగబోతుందనేది కూడా ఊహించడం పెద్ద కష్టమేం కాదు. ఈ సినిమా ద్వారా మనుషుల్ని చంపడానికి కొత్త చిట్కా ఒకటి తెలుస్తుంది. తలకి ఆముదం పట్టించి, ఐస్‌ వాటర్‌లో ఆ మనిషి ముంచి తీసి, తర్వాత కొబ్బరి నీళ్లు తాగించినట్టయితే, నడి రాత్రిలో చలిజ్వరం వచ్చి ప్రాణాలు విడిచేస్తారట. సుదీర్ఘంగా ఫుల్‌ డీటెయిల్స్‌తో ఈ విషయాన్ని దర్శకుడు ముత్తయ్య తెరకెక్కించాడు. క్లోజప్‌లో ఖాండ్రించి ఉమ్మడం, అతి భయంకరంగా ఉన్న టాయిలెట్‌ కమోడ్‌ని క్లోజప్‌లో చూపించడం లాంటి స్పెషల్స్‌ ఉండనే ఉన్నాయి. 

ఊర నాటు జనాలకి తప్ప ఈ 'రాయుడు'ని తట్టుకోవడం సాధారణ పెజానీకం వల్ల కాదు. సరైనోడు లాంటి మన మార్కు మాస్‌ సినిమాలకి, ఈ తమిళ 'టూమచ్‌' మాస్‌ చిత్రాలకి చాలా తేడా వుంది. మన మాస్‌ సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా, కలర్‌ఫుల్‌గా తీస్తే... తమిళవాళ్లు మరీ 'రా'గా తీసేస్తుంటారు. కనుక 'రా...యుడు'లాంటి మాస్‌ చిత్రాలని భరించాలంటే మనకి 'విశాల' హృదయాలుండాలి. 

విశాల్‌ మేకోవర్‌ చాలా బాగుంది. పాత్రకి తగినట్టుగా జట్టు కూలీలానే ఉన్నాడు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ పాత్రలో శ్రీదివ్య కూడా మెప్పిస్తుంది. కానీ ఒక లాయర్‌ కూతురికి, ఒక కూలీతో పెళ్లి అంత సింపుల్‌గా, పెద్ద విషయమే కాదన్నట్టు తీసేయడం ఇల్లాజికల్‌గా వుంది. రాధా రవి గెటప్‌, నటన బాగున్నాయి. మెయిన్‌ విలన్‌గా సురేష్‌ కూడా క్యారెక్టర్‌కి తగినట్టున్నాడు. సూరి కామెడీ నవ్వించలేకపోయింది. బామ్మ పాత్ర చేసిన లీల మనవాళ్లని ఆకట్టుకోవడం కాస్త కష్టమే. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్‌ క్లాస్‌. ఇంత లెంగ్త్‌ లేకుండా ఎడిటర్‌ జాగ్రత్త పడాల్సింది. టెక్నికల్‌గా తమిళ సినిమాల్లో చాలా వరకు ఉన్నతంగా ఉంటాయి. ఇది మినహాయింపేమీ కాదు. సహజత్వాన్ని చూపించడానికి ముత్తయ్య పడ్డ తపన బానే వుంది కానీ తన దర్శకత్వ ప్రతిభకి తగ్గ కథని తానే రాసుకోలేదు. కాకపోతే ఈ తరహా ట్రీట్‌మెంట్‌ తమిళ రూరల్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోవచ్చు. 

పక్కా మాస్‌ సినిమా అనే సంగతి పోస్టర్స్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కనుక ఓపెనింగ్స్‌ పరంగా ఢోకా ఉండకపోవచ్చు కానీ నేటివిటీ అసలే లేని ఈ మూస సినిమాని మన మాస్‌ ప్రేక్షకులు ఎన్నాళ్లు ఆదరిస్తారో చూడాలి.

బోటమ్‌ లైన్‌: మనం మెచ్చే 'రాయుడు' కాదు!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?