Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రైట్‌ రైట్‌

సినిమా రివ్యూ: రైట్‌ రైట్‌

రివ్యూ: రైట్‌ రైట్‌
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: సుమంత్‌ అశ్విన్‌, ప్రభాకర్‌, పూజ జవేరి, పావని, నాజర్‌, షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌, రాజారవీంద్ర, వినోద్‌, భరత్‌ రెడ్డి తదితరులు
కథ: సుగీత్‌
మాటలు: డార్లింగ్‌ స్వామి
సంగీతం: జె.బి.
కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌
ఛాయాగ్రహణం: శేఖర్‌ వి. జోసెఫ్‌
నిర్మాత: జె. వంశీకృష్ణ
దర్శకత్వం: మను
విడుదల తేదీ: జూన్‌ 10, 2016

రీమేక్‌ సినిమాలతో ఒక సౌలభ్యముంది. ఒరిజినల్‌ కథ అయితే తెర మీద ఎలా ఉంటుందనేది తీసాక కానీ తెలీదు. కానీ రీమేక్‌ అయితే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ముందే చూసుకోవచ్చు. ఒక ఫ్లాట్‌ కొనడానికి వెళ్లారనుకోండి... ప్లాన్‌ తాలూకా స్కెచ్‌ చూపించి మీ ఫ్లాట్‌ ఇలా ఉంటుంది అని చెప్పడం ఒరిజినల్‌ కథ అనుకుంటే, మోడల్‌ ఫ్లాట్‌ తయారు చేసి, మీ ఫ్లాట్‌ అచ్చంగా ఇలాగే ఉంటుందని చూపించడం రీమేక్‌ అన్నమాట. తెరపైకి రాని కథల్ని సెలక్ట్‌ చేసుకోవడంలో తప్పులు చేయవచ్చు కానీ ఆల్రెడీ తెరకెక్కిన కథలపై పెట్టుబడి పెట్టడానికేంటి?

అయితే ఇంత సౌకర్యమున్నా కానీ రీమేక్‌ సినిమాల విషయంలో చాలా సార్లు పల్టీ కొడుతూ ఉండడమే విచిత్రంగా తోస్తుంది. 'రైట్‌ రైట్‌' మలయాళంలో నాలుగేళ్ల క్రితం వచ్చిన 'ఆర్డినరీ' అనే సినిమాకి రీమేక్‌. మలయాళ దర్శకుడి గట్స్‌కి మెచ్చుకోవాలి... ఒక ఆర్డినరీ కథ రాసుకుని, తన సినిమాకి ఆర్డినరీ అనే టైటిల్‌ పెట్టినందుకు! మలయాళంలోను ఆర్డినరీ ఒక ఎక్స్‌ట్రార్డనరీ సినిమా అయితే కాదు. కానీ మనవాళ్లు అదే ఆర్డినరీ కథని కళ్లకి అద్దుకుని మళ్లీ ఇక్కడ బస్సెక్కించి రైట్‌ రైట్‌ అనేసారు. కథాపరంగా ఎలాంటి కొత్తదనం కానీ, అనూహ్యమైన సంఘటనలు కానీ, ఆకట్టుకునే సంఘర్షణ కానీ, కదిలించే భావోద్వేగాలు కానీ లేవు. చాలా సింపుల్‌.. ఇంకో మాటలో చెప్పాలంటే ఆర్డినరీ కథ. 

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ మధ్య ఉన్న స్నేహం, వారి నేపథ్యం, వాళ్లకి డ్యూటీ వేసిన గవిటి అనే ఊరి తాలూకు పచ్చదనం. డ్రైవర్‌ చెల్లికి పెళ్లి కుదురుతుంది, కండక్టర్‌కి గవిటిలో ఒక పిల్ల దొరుకుతుంది. అంతా హ్యాపీస్‌ అనుకుంటూ ఉండగా అనుకోని సంఘటన. ఒక్కసారిగా వారి లైఫ్‌ బస్సు రివర్స్‌ గేర్‌లో పడుతుంది. ఆ సమస్య నుంచి వారు ఎలా గట్టెక్కారన్నది మిగతా సినిమా. ఒక మామూలు పల్లెటూరి కథలా అనిపిస్తోన్న కథ సడన్‌గా మర్డర్‌ మిస్టరీగా టర్న్‌ తీసుకోవడమనేది ఆసక్తికర అంశమే. కానీ ఆ మర్డర్‌ మిస్టరీ చేధించడానికి మేథావి బుర్రలేం అక్కర్లేదు. కేవలం రెండే పాత్రలు అనుమానంగా కనిపిస్తుంటాయి. అందులో ఒక క్యారెక్టర్‌ మొదటి నుంచి పర్పస్‌ లేకుండా హైలైట్‌ అవుతుంటుంది. కనుక ఆ మర్డర్‌కి సూత్రధారి ఎవరై ఉంటారనేది ఊహించడం అంత కష్టమైన పజిలేం కాదు. ద్వితీయార్థం మొత్తం నడిచేది ఈ సస్పెన్స్‌ మీదే కావడం, ఆ సస్పెన్స్‌ ఏంటనేది మనకి ఇంటర్వెల్‌కే బోధ పడిపోవడంతో ఇక సెకరడ్‌ ఆఫ్‌ మొదలు కాకుండానే ఈ బస్సు బోర్‌కొచ్చేసినట్టయింది. 

ప్రథమార్ధం దగ్గరకి వస్తే పల్లెటూరి పాత్రలు, అక్కడుండే సరదాలు, ఒక ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ల మధ్య ఉండే సహచర్యం వగైరా విషయాలతో సరదాగా సాగడానికి ఆస్కారముంది. కానీ ఈ బస్సు ప్రయాణం మొదలు కావడమే అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఆ జర్నీ మరీ నిస్సారంగా అనిపిస్తూ ఉండడంతో నిద్ర మత్తు ముంచుకొస్తుంది. సడన్‌గా ఒక్క కుదుపుతో, ఇంటర్వెల్‌కి కానీ రాని కథలోని ప్రధాన ఘట్టంతో కాస్త చలనం వచ్చినా, జరగబోయేది ఏంటో తెలిసిపోవడంతో ఈ బస్సు ప్రయాణం మొత్తంగా తుస్సుమంటుంది. 

లేత సుమంత్‌ అశ్విన్‌ని కండక్టర్‌గా చూడడం కాస్త కష్టమే. కోపంగా రౌడీలని కొడుతున్నా కానీ చిన్న పిల్లాడు కలబడుతున్నట్టే అనిపిస్తుంది తప్ప హీరో ఫీలింగ్‌ కలగదు. సుమంత్‌ మంచి నటుడనే దాంట్లో సందేహం లేదు. అవలీలగా హావభావాలు మార్చగల నటుడే, కాకపోతే అన్ని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే నేర్పరి కాదు. కాలకేయుడు ప్రభాకర్‌కి బాహుబలి తర్వాత ఇంతటి కీలక పాత్ర పోషించే అవకాశం రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ రౌద్ర రసం తప్ప మరోటి పోషించలేకపోవడం బలహీనత. ఇందులోని డ్రైవర్‌ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. కరకుగా కనిపించే ఎమోషనల్‌ పర్సన్‌. మొరటుగా అనిపించే ఫ్లర్ట్‌, స్నేహితుడికి, చెల్లెలికి మధ్య నలిగిపోయే క్యారెక్టర్‌. కానీ అన్ని వేరియేషన్స్‌ ప్రభాకర్‌ చూపించలేకపోయాడు. 

ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరితే, ఈ సినిమాకి అంత రైట్‌ స్టార్టప్‌ దొరికేది. కానీ అది అస్సలు కుదరకపోవడంతో బస్సు స్టార్టవడానికే ఇబ్బంది పడింది. హీరోయిన్‌ పూజ జవేరి కారణంగా లవ్‌ ట్రాక్‌ కూడా ట్రాక్‌ తప్పింది. హీరోయిన్‌ మెటీరియల్‌ కాకపోవడంతో రొమాన్స్‌ పార్ట్‌ కూడా పంక్చరైంది. నాజర్‌కి అలవాటైన పాత్రే. షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌కి నవ్వించే వీల్లేకపోయింది. పాటలు సోసోగా అనిపిస్తాయి. కెమెరా పనితనం బాగుంది. గవిటి అందాలని శేఖర్‌ కెమెరా చాలా బాగా చూపించింది. దర్శకుడు మను తాను చేయగలిగింది చేసాడు. ఈ కథని ఎంచుకోవడం దగ్గరే పెద్ద తప్పు దొర్లినప్పుడు దానిని దిద్దుకునే అవకాశం లేకపోవడం అతని తప్పు కాదు. 

బస్సు ప్రయాణంలో ఉచిత ప్రదర్శనగా వేస్తే, చూడని ఈ చిత్రానికి బదులు చూసేసిన ఇంకేదైనా సినిమా చూపిస్తే బాగుండని మనసులో కోరుకునే బాపతు సినిమా ఇది. ఇక థియేటర్ల వరకు వెళ్లి టికెట్టు కొనుక్కుని మరీ ఈ బస్సు ఏం ఎక్కగలం చెప్పండి?

బోటమ్‌ లైన్‌: బ్రేక్‌ డౌన్‌!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?