Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: తిక్క

రివ్యూ: తిక్క
రేటింగ్‌: 1/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌
తారాగణం: సాయి ధరమ్‌ తేజ్‌, లారిస్సా, మన్నర చోప్రా, రాజేంద్రప్రసాద్‌, సప్తగిరి, సత్య, అలీ, రఘుబాబు, అజయ్‌, తాగుబోతు రమేష్‌, ఆనంద్‌, వెన్నెల కిషోర్‌, ముమైత్‌ ఖాన్‌ తదితరులు
కథ, కథనం: షేక్‌ దావూద్‌
మాటలు: హర్షవర్ధన్‌, లక్ష్మిభూపాల్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌
నిర్మాత: డా|| సి. రోహిన్‌రెడ్డి
దర్శకత్వం: సునీల్‌రెడ్డి
విడుదల తేదీ: ఆగస్టు 13, 2016

సినిమా చూస్తున్నంతసేపు మనల్ని వేధించే ఒకే ఒక్క ప్రశ్న... 'వై తేజూ వై?!' 

హీరోగా ఇప్పటికే ఒక స్టాండర్డ్‌ మార్కెట్‌ ఏర్పరచుకున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా అనగానే తప్పక చూడాలని ప్రేక్షకులు ముందే డిసైడ్‌ అయ్యే స్థాయిని చేరిపోయాడు. ఇలాంటి టైమ్‌లో 'తిక్క'లాంటి సినిమా ఎందుకు చేసినట్టు? ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ కాకుండా ఎవరైనా కొత్త కుర్రాడు ఉండుంటే దీనిని ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదేమో, ఒకవేళ పట్టించుకున్నా కానీ ఇది చూసినందుకు పెద్దగా బాధ పడివుండేవారు కాదేమో. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' అంటూ తన గత చిత్రాలని క్వాలిటీ డైరెక్టర్లతో చేసిన తేజ్‌, ఈసారి 'ఓం 3డి' తీసిన సునీల్‌ రెడ్డితో చేస్తున్నాడంటే ఖచ్చితంగా కథ అంత గొప్పగా ఉండి ఉంటుంది, తప్పకుండా ఇందులో ఏదో ఎక్సయిటింగ్‌ ఎలిమెంట్‌ ఉండే ఉంటుంది అని భావిస్తే మన తప్పు కాదు. 

కానీ 'తిక్క' చూస్తున్నంతసేపు 'ఈ సినిమా ఇప్పుడెందుకు చేసాడు?' అనే ప్రశ్నే మదిని తొలుస్తుంటుంది. అతడిని మెప్పించిన ఆ అంశమేదో వస్తుందనే ఆశ ఒక్కటే కూర్చోబెడుతుంది. కానీ చివరిగా అతనికి ఇది ఎందుకు నచ్చిందో అర్థం కాదు సరి కదా, ఎక్కడో 'వైవిఎస్‌ చౌదరి' కులాసాగా ఉన్న విజువల్‌ కంట్లో కదలాడుతుంది... 'తేజ్‌ కెరియర్‌లో అత్యంత బ్యాడ్‌ సినిమాగా 'రేయ్‌' మిగిలిపోదు' అనే ఆనందంలో ఉన్నట్టుగా! 'ఓం 3డి' తర్వాత మరో అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికంటే చాలా బెటర్‌ సినిమా అందించడానికే ప్రయత్నిస్తారెవరైనా. కానీ సునీల్‌ రెడ్డి మాత్రం అప్పుడు తన సినిమా 'అస్సలు బాలేదు' అన్నవాళ్లతోనే 'అదే చాలా బెటర్‌' అనిపించడానికి కృషి చేసినట్టు అనిపించింది. 

'తిక్క' పెట్టే చిత్రవధని అక్షరబద్ధం చేయడమంత తేలిక కాదు. హీరో హీరోయిన్లతో సహా ప్రతి క్యారెక్టర్‌ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. క్యారెక్టర్స్‌ మధ్య కన్‌ఫ్యూజన్‌ సృష్టించి కామెడీ పుట్టించాలనేది రచయిత, దర్శకుల ఉద్దేశం అయినప్పటికీ హాస్యం పుట్టకపోగా 'తిక్క' టైటిల్‌కి తగ్గ సినిమాగా రూపుదిద్దుకుంది. కథలోకి ఎంటరయ్యే ప్రతి క్యారెక్టర్‌తో గందరగోళం మరింత ఎక్కువవుతుందే తప్ప 'తిక్క' తలక్కెదు. ప్రథమార్ధమే గత్తర గత్తరగా ఉందనిపిస్తే, ద్వితీయార్ధం మరింతగా హింస పెడుతుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది కానీ అది తెరపై జరుగుతున్నది చూడడం వలన వచ్చిన నవ్వో, లేక ఇది చూసేందుకు వచ్చినందుకు మనల్ని చూసుకుని మనకే నవ్వు వస్తున్నదో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. 

వరుసపెట్టి కమర్షియల్‌ సినిమాలే చేస్తోన్న సాయిధరమ్‌ తేజ్‌ మొనాటనీ బ్రేక్‌ చేసేందుకు ఈ అటెంప్ట్‌ చేసి ఉంటాడేమో తెలీదు కానీ, 'తిక్క'ని ఎంచుకుని మాత్రం పెద్ద బ్లండర్‌ చేసాడు. మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన తేజ్‌ ఇందులో మాత్రం అయోమయంగా కనిపించాడు. డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ కూడా అనాసక్తిగా చేసేసాడనే భావన కలిగిస్తాయి. హీరోయిన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలీ, రాజేంద్రప్రసాద్‌, సప్తగిరి, రఘుబాబు, అజయ్‌... ఇలా తారాగణం పరంగా టాలెంట్‌కి ఏమాత్రం లోటు లేదు. కానీ ఏ ఒక్కరి టాలెంట్‌ని వాడుకోక పోగా, వారందరిపై గౌరవం ఒక రవ్వంత తగ్గేటట్టుగా అందరి పాత్రలనీ తీర్చిదిద్దాడు దర్శకుడు. 'నటకిరీటి' గెటప్‌, క్యారెక్టరైజేషన్‌ అయితే వర్ణనాతీతం. 

Watch Tikka Movie Public Talk

'తిక్క'లో మెచ్చుకోతగ్గ అంశం ఏదైనా ఉంటే పాటలు, వాటి చిత్రీకరణ మాత్రమే. 'తిక్క తిక్క తిక్కగున్నదే', 'హాట్‌ షాట్‌ హీరో', 'వెళ్లిపోకే' సాంగ్స్‌ వినడానికి, చూడ్డానికి కూడా బాగున్నాయి. ఈ కథకి, ఈ సిట్యువేషన్స్‌కి తమన్‌ ఇంతగా ఇన్‌స్పయిర్‌ అయి, ఇంత మంచి మ్యూజిక్‌ ఇవ్వడం గొప్ప విషయమే. బహుశా సునీల్‌ రెడ్డి తెరపై తీసే దానికంటే కథ బాగా చెప్తాడేమో మరి. అతడిని నమ్మి కళ్యాణ్‌రామ్‌ అప్పుడు కోట్లు కుమ్మరిస్తే, ఇప్పుడు ఫామ్‌లో ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ మిగిలిన అన్ని ప్రాజెక్టుల కంటే ముందు దీనిని ఫినిష్‌ చేసాడంటే కారణం అదే అనుకోవాలి. ఎడిటర్‌ని మెచ్చుకుని తీరాలి. తెరపై ఏం జరుగుతుందనే గందరగోళం కన్సిస్టెంట్‌గా మెయింటైన్‌ చేసిన సినిమాని ఎడిట్‌ చేయడమంటే మాటలు కాదు మరి. ఓం 3డిని బీట్‌ చేసే తిక్క తీయగలిగిన సునీల్‌ రెడ్డికి మళ్లీ దీనిని బీట్‌ చేసే సినిమా తీయడం మాత్రం అంత తేలిక కాదనే చెప్పాలి. తనకి తానే కాకుండా బ్యాడ్‌ సినిమాలకే ఒక బెంచ్‌ మార్క్‌ని సెట్‌ చేసి పెట్టేసాడీసారి. 

సినిమా మొదలైన దగ్గర్నుంచీ అదే పనిగా కార్‌ క్రాష్‌లు చూపిస్తూ ఉంటే, ఒక దశలో సినిమా థియేటర్లో కంటే... ఆ కార్లలో ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. అదే పనిగా బీర్‌ బాటిల్స్‌తో ఒకరి తలపై ఒకరు బాదుకుంటూ ఉంటే, మన చేతిలోను ఒకటుంటే ఎంత బాగుండేదో అనుకునేలా చేస్తుంది. ప్రతి ఏడాదీ ఎనభై శాతానికి పైగా బ్యాడ్‌ సినిమాలు, ఫ్లాప్‌ సినిమాలు వస్తూ ఉంటాయి కానీ... 'తిక్క'లాంటి ఆణిముత్యాలు మాత్రం స్పెషల్‌ కేటగిరీలోకి చేరతాయి. వీటి గురించి ఎంత చెప్పినా, రాసినా మొత్తం కన్వే చేయలేరెవరూ... థియేటర్‌కెళ్లి ఎక్స్‌పీరియన్స్‌ చేసి రావాల్సిందే. 

బోటమ్‌ లైన్‌: లెక్కలేనంత తిక్క!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?