Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: దాగుడుమూత దండాకోర్‌

సినిమా రివ్యూ: దాగుడుమూత దండాకోర్‌

రివ్యూ: దాగుడుమూత దండాకోర్‌
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: రాజేంద్రప్రసాద్‌, సారా అర్జున్‌, సిద్ధు, నిత్యాశెట్టి, రవిప్రకాష్‌, ప్రభు, శ్రీహర్ష, సత్యం రాజేష్‌, సంధ్యాజనక్‌, బాలు తదితరులు
కథ: ఎ.ఎల్‌. విజయ్‌
మాటలు: పెద్దింటి అశోక్‌ కుమార్‌
సంగీతం: వి.ఎస్‌. మూర్తి
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌
సమర్పణ: క్రిష్‌
నిర్మాత: రామోజీరావు
దర్శకత్వం: ఆర్‌.కె. మలినేని
విడుదల తేదీ: మే 9, 2015

తమిళంలో ప్రశంసలు అందుకున్న ‘శైవమ్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. శాకాహారం భుజించడాన్ని ప్రమోట్‌ చేస్తూ, ఒక చిన్న సందేశంతో కూడిన ఫ్యామిలీ మూవీని దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కించిన తీరు అభినందనలు అందుకుంది. ఈ చిత్రం విజయ్‌కి పర్సనల్‌ మూవీ. తన జీవితంలోని కొన్ని అనుభవాల్ని, సంఘటలని అతను డ్రమెటైజ్‌ చేసి తీసిన చిత్రమది. ఆ కథని తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావించిన ఉత్తమాభిరుచి ఉన్న నిర్మాతలు రామోజీరావు, క్రిష్‌ ప్రశంసనీయులు. అయితే దురదృష్టవశాత్తూ ‘దాగుడుమూత దండాకోర్‌’ చిత్రం ఒరిజినల్‌కి చాలా విధాలుగా న్యాయం చేయలేకపోయింది.

ఒక దర్శకుడి పర్సనల్‌ మూవీని మరో దర్శకుడు రీమేక్‌ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఒరిజినల్‌ అద్భుతంగా ఉండి, దానికి మక్కీకి మక్కీ తీసిన కొన్ని రీమేక్‌ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోవడానికి కారణమిదే. అదే కథ, అవే సంఘటనలు, సన్నివేశాలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సహజత్వం రీమేక్‌ సినిమాల్లో ఒక్కోసారి లోపిస్తుంది. ఆ సినిమా తాలూకు ఆత్మని, అనుభూతిని పునఃసృష్టించడంలో పొరపాట్లు దొర్లుతాయి. ‘దాగుడుమూత దండాకోర్‌’ చిత్రానికి మంచి కథ ఉన్నప్పటికీ... ఒక రెండు గంటల సినిమాగా మెప్పించే డ్రామా మిస్‌ అయింది. నిజానికి ఈ చిత్రానికి ఒరిజినల్‌ అయిన ‘శైవమ్‌’లోనే కొన్ని సమస్యలున్నాయి. అయితే వాటిని చిత్రీకరణతో, వీనుల విందైన సంగీతం సాయంతో విజయ్‌ చాలా వరకు కవర్‌ చేయగలిగాడు. ‘దాగుడుమూత దండాకోర్‌’ విషయానికి వచ్చేసరికి అనుకరణే తప్ప అనుభూతికి ఆస్కారం లేకుండా పోయింది. పైగా ఒరిజినల్‌లో ఉన్న బలాలు కూడా ఇక్కడ కనిపించకుండా పోయాయి. 

ఊరికి పెద్దయిన రాజుగారింటికి (రాజేంద్రప్రసాద్‌) వేరే ఊళ్లల్లో, దేశాల్లో సెటిల్‌ అయిన కొడుకు, కోడళ్లు, కూతురు, మనవళ్లూ అందరూ వస్తారు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో ఎప్పుడో మొక్కుకుని తీర్చని ఒక మొక్కు కారణంగా వారికి కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. పోలేరమ్మకి కోడిని బలిస్తామంటూ మొక్కుకుని, అది తీర్చకపోవడంతోనే ఇలా అవుతుందని.. వచ్చే జాతరలో ఆ కోడిపుంజుని బలి ఇద్దామని నిర్ణయించుకుంటారు. కానీ నాలుగేళ్లుగా ఆ ఇంట్లోనే పెరుగుతోన్న ఆ కోడిపుంజుని నాని అని పిలుచుకుంటూ ముద్దుగా చూసుకుంటుంటుంది రాజుగారి మనవరాలు బంగారం (సారా అర్జున్‌). దానిని చంపాలని పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో అది ఎవరికీ కనిపించకుండా అటక మీద దాచేస్తుంది. ఇక ఆ కోడిపుంజు ఎక్కడుందనే వెతుకులాట మొదలవుతుంది. 

చాలా సింపుల్‌ స్టోరీ అయినా కానీ ‘మన బాగు కోసం నోరు లేని జీవుల్ని బలి ఇవ్వకూడదు’ అనే సటిల్‌ మెసేజ్‌ కూడా ఇందులో ఉంది. కథగా దీనికి వంక పెట్టడానికేమీ లేదు కానీ సినిమాగా మలిచేంత మెటీరియల్‌ అయితే లేదు. వార పత్రికల్లో, నాన్‌ డీటెయిల్డ్‌లో వచ్చే ఒక ఫీల్‌గుడ్‌ షార్ట్‌ స్టోరీ మాదిరిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కలిసిన కుటుంబం, టీనేజ్‌ బావా మరదళ్ల సరదాలు, మనవళ్ల అల్లర్లు.. వగైరా ముచ్చట్లు బాగానే అనిపించినా కానీ హత్తుకునే సన్నివేశాలు కానీ, బలమైన డ్రామా కానీ ఇందులో కానరాదు. శైవమ్‌ చిత్రంలోని బలహీనతల్ని జి.వి. ప్రకాష్‌ సంగీతం చాలా వరకు కప్పిపుచ్చింది. క్లాసికల్‌, ఫోక్‌ మ్యూజిక్‌ని మిక్స్‌ చేసి అతను ఆ చిత్రానికి వన్నె తెచ్చాడు. ‘అళగే అళగే..’ అంటూ సాగే పాట ఆ చిత్రానికే హైలైట్‌గా నిలిచింది. ‘దాగుడుమూత దండాకోర్‌’కి సంగీతం అందించిన మూర్తి ఆ మ్యాజిక్‌ని రిపీట్‌ చేయలేకపోయాడు. 

అలాగే నటీనటవర్గంలో చాలా మంది సహజత్వాన్ని తీసుకురాలేకపోయారు. రాజేంద్రప్రసాద్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఈ చిత్రానికి నిండుదనం తెచ్చారు. ఈ చిత్రంలోని బెస్ట్‌ మూమెంట్స్‌ అన్నీ బేబీ సారా అర్జున్‌ అందిస్తుంది. నాన్న చిత్రంలో నటించిన సారా ‘శైవమ్‌’లో ఈ పాత్రని తనే చేసింది. ఆమె క్యూట్‌ ఫేస్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌. మిగిలిన తారాగణం అంతా చాలా సాదాసీదా నటనతో ఈ కథకి అత్యవసరమైన నేచురల్‌ ఫీల్‌ తీసుకురావడంలో విఫలమైంది. రాజేంద్రప్రసాద్‌కి టీనేజ్‌ మనవరాలిగా నటించిన నిత్యాశెట్టి ఫీచర్స్‌ కలర్స్‌ స్వాతిని తలపిస్తాయి.

చిన్న సినిమా అయినా కానీ ఒరిజినల్‌ వెర్షన్‌ టెక్నికల్‌గా కూడా ఉన్నతంగా అనిపిస్తుంది. ‘దాగుడుమూత దండాకోర్‌’ గురించి మాత్రం ఆ మాట అనలేం. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ అన్నీ యావరేజ్‌గా అనిపిస్తాయి. ఏదీ అవుట్‌స్టాండింగ్‌ అనిపించుకోదు. ఏదీ కథని, సన్నివేశాల్ని మరింతగా ఎలివేట్‌ చేయలేదు. రెండు గంటల నిడివి మాత్రమే ఉన్నా కానీ కాన్‌ఫ్లిక్ట్‌ మరీ సింపుల్‌ అయిపోవడంతో సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామాపై ఫోకస్‌ పెట్టినట్టయితే బాగుండేది. ఒక మంచి కథని, ఉద్దేశాన్ని అప్రీషియేట్‌ చేయవచ్చు కానీ ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం ఈ చిత్రం అందించలేకపోయిందనే చెప్పాలి. వాణిజ్య విలువలు లేకపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి చిత్రాల్లో ‘గుర్తుండిపోయే’ లక్షణాలైతే కొన్నయినా ఉండాలి. అలాంటివి లేకపోగా, కనీసం మనసుని స్పృశించే సన్నివేశాలు, కదిలించే సందర్భాలు కూడా కొరవడడంతో ‘దాగుడుమూత దండాకోర్‌’ కేవలం ఒక సగటు చిత్రమనిపించుకుంటుంది.

బోటమ్‌ లైన్‌: దాగుడుమూత దండాకోర్‌... ఎక్కడి ప్రేక్షకులు అక్కడే గప్‌చుప్‌!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?