Advertisement


Home > Politics - Gossip
683 కోట్లు.. ఇదిగో కొత్త కథ.!

ఆంధ్రప్రదేశ్‌లో 'హవాలా' వెలుగు చూసింది. అదే, విశాఖపట్నంలో ఓ సామాన్యుడు, పైగా 24 ఏళ్ళ కుర్రాడు.. ఏకంగా 683 కోట్ల రూపాయల్ని అక్రమంగా విదేశాలకు తరలించిన కేసులో బుక్కయ్యాడు. 'నేను మధ్యవర్తిని మాత్రమే.. నాకు కొంచెం కమిషన్‌ అందిందంతే..' అని చెబుతున్నాడతడు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా హాట్‌ టాపిక్‌ అయ్యిందీ 'హవాలా' వ్యవహారం. 

చిత్రంగా, ఇది 'హవాలా' కాదు, 'మనీ లాండరింగ్‌' అని తేల్చేశారు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ. హవాలాకీ, మనీ లాండరింగ్‌కీ తేడాలుండొచ్చుగాక. అది వేరే కేసు, ఇది వేరే కేసు కావొచ్చుగాక. కానీ, తరలిపోయిన మొత్తం తక్కువేమీ కాదు. 683 కోట్ల రూపాయలు అక్రమంగా విదేశాలకు తరలిపోయింది. అంటే, ఇది చాలా పెద్ద ఆర్థిక నేరంగా పరిగణించాల్సి వుంటుంది. 

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ విషయంలో ఏం జరిగింది.? అబ్బే, అది కాల్‌ మనీ ఉదంతం మాత్రమే, దాన్ని సెక్స్‌ రాకెట్‌ అనీ, ఇంకో రాకెట్‌ అనీ అనడం సబబు కాదంటూ అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం, శాసనసభ సాక్షిగా 'తేల్చే'సింది. తర్వాత కథ ఏమయ్యిందో అందరం చూశాం. ఇప్పుడీ హవాలా - మనీ లాండరింగ్‌ వ్యవహారం కూడా అలాగే 'తేలి'పోతుందా.? ఏమో, ప్రస్తుతానికైతే ఆ అనుమానాలే బలపడ్తున్నాయి. 

విశాఖకు సంబంధించినంతవరకు ఇంతుకు ముందెన్నడూ ఈ తరహా ఉదంతం ఎప్పుడూ వెలుగుచూడలేదు. పైగా, ఇదే తరహా ఆరోపణలు విజయవాడలో 'ఆసుపత్రి మాఫియా' కారణంగా వెలుగు చూసింది. దేశంలో ఇటీవలి కాలంలో ఈ తరహా ఉదంతాలు చాలా అరుదుగా మాత్రమే దర్శనమిస్తున్నాయి. అవి కూడా, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు వెలుగు చూస్తున్నాయట.? కాస్త అనుమానించాల్సిన విషయమే ఇది. 

ఇంత పెద్ద మొత్తం, అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా దేశం సరిహద్దులెలా దాటుతుంది.? విశాఖ వేదికగా ఇంత పెద్ద మనీ ల్యాండరింగ్‌ వ్యవహారం (హవాలా కాదు, మనీ లాండరింగే అనుకుందాం..) జరిగిందంటే, స్థానిక ప్రజా ప్రతినిథుల పాత్ర లేదని ఎలా అనుకోగలం.? అని డీజీపీ తేల్చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలీ ప్రశ్నలకి.