Home > Politics - Gossip
ఎ ఫిలిం బై 'నిచ్చెలి'.!

మీకు తెలుసా జయలలిత ఎలా చనిపోయారో.! ఆసుపత్రిలో ఆమెకు ఏ తరహా వైద్యం అందిందో తెలుసుకోవాలని వుందా.? అయితే, మీ కోసమే ఈ సినిమా.! ఎ ఫిలిం బై నిచ్చెలి.. అదేనండీ, ఎ ఫిలిం బై శశికళ.. అతి త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాణమే కాదు, సినిమాటోగ్రఫీ కూడా స్వయంగా శశికళే కావడం గమనార్హం. 

75 రోజులపాటు ఓ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో అచేతనావస్థలో పడి వుండడమంటే చిన్న విషయమేమీ కాదు. ఈ 75 రోజుల్లో కేవలం మూడంటే మూడే సార్లు ఆమె స్పృహలోకి వచ్చారట. ఇది నిజమా.? అబద్ధమా.? అన్నది మాత్రం 'సినిమా' చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే, జయలలితకు వైద్య చికిత్స అందుతున్న సమయంలో నేతలు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు బయటకొస్తున్న విషయాలు వేరు. దానికీ దీనికీ ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. 

గొప్పోళ్ళ మరణాలు ఎప్పటికీ మిస్టరీనే. స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎలా చనిపోయారు.? అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్పగలం.! దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్‌ ప్రమాదమెలా జరిగిందంటే ఏం సమాధానమిస్తాం.? జయలలిత డెత్‌ మిస్టరీ కూడా అంతే. 

కానీ, 'ఎ ఫిలిం బై శశికళ' గురించి దినకరన్‌ చేసిన ప్రకటనతో ఇప్పుడంతా ఉలిక్కిపడ్డారు. బహుశా అపోలో ఆసుపత్రి వర్గాలు కూడా షాక్‌కి గురై వుండాలి. ఎందుకంటే, ఆ 'సినిమా' అపోలో ఆసుపత్రి వర్గాల దగ్గర కూడా వుందని దినకరన్‌ బాంబు పేల్చారు మరి. 75 రోజులు, రోజులో 24 గంటలు.. మొత్తంగా 'సినిమా తీశారు' అంటే, ఇదేమీ చిన్న విషయం కాదు. దినకరన్‌ చెబుతున్న మాటల్ని ఎలా విశ్వసించగలం.? 

తమిళనాడులో పళనిసామి ప్రభుత్వం, జయలలిత మర్డర్‌ మిస్టరీకి సంంధించి వాస్తవాలు తేల్చేందుకు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఈ నేపథ్యంలోనే దినకరన్‌ 'ఎ ఫిలిం బై శశికళ' అంశాన్ని తెరపైకి తెచ్చారు. 'జయలలిత మరణం వెనుక మిస్టరీ ఏమీ లేదు..' అని ఆయన చెప్పాలనుకున్నారుగానీ, ఇప్పుడీ 'సినిమా' వ్యవహారంతో ఒక్కసారిగా తమిళనాడు ఉలిక్కిపడిందన్నది నిర్వివాదాంశం. 'ఆ సమయంలో' (అంటే, ఆ 75 రోజులు) జయలలిత పక్కన కేవలం శశికళే వున్నారు. సో, సినిమా తీసే ఛాన్స్‌ ఆమెకు మాత్రమే వుంది మరి.!