Advertisement


Home > Politics - Gossip
కాంగ్రెస్ అంటే అంత అసహ్యం పుట్టిందా!

వారితో మైత్రీ బంధాన్ని పెనవేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహం ప్రదర్శించింది. పదేపదే కాంగ్రెస్ దూతలు వారితో భేటీలు అయ్యారు. వారి అపాయింట్మెంట్ల కోసం నానా పైరవీలు చేసుకుని మరీ కలిశారు.. ప్రతిపాదించార.. ఒత్తిడిచేశారు.. అన్ని మార్గాలను అనుసరించారు. ఎట్టకేలకు పొత్తులు కుదిరి పోటీకిదిగారు. కానీ ఉభయ భ్రష్టత్వం ఉభయులకూ తప్పలేదు. ఇటు సొంత బలమూ దెబ్బతింది.. ఎన్నికల్లో విజయమూ దక్కలేదు. ఆ అనుభవం ఎన్ని పాఠాలు నేర్పిందో ఏమో తెలియదు గానీ.. ఇప్పుడు ఆ పార్టీ సారథి మాత్రం.. పొత్తు ల మాటెత్తితేనే మండిపడుతున్నారు.

ఇదంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన సంగతి. ఆ రాష్ట్రంలో మొన్నటిదాకా రాజ్యం చేసిన సమాజ్ వాదీ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావడానికి పార్టీని ప్రిపేర్ చేయడానికి మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అఖిలేష్ ను విలేకర్లు 2019 ఎన్నికల్లో పెట్టుకోబోయే పొత్తుల గురించి అడిగారు. దాంతో ఆయనలోని ఆగ్రహం బయటపడింది.  

పొత్తుల గురించి మాట్లాడడమే దండగ. అది సమయాన్ని వృథా చేసుకునే పని.. అని అఖిలేష్ ఘాటుగా స్పందించారు. పొత్తుల గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్, పొత్తుల ఊసు లేకుండా ఎష్పీని బలోపేతం చేసుకోవడానికి కష్టపడుతున్నాం అని అఖిలేష్ అంటున్నారు. అయితే.. అప్పుడే అఖిలేష్ మాటల్ని అందుకునే భాజపా తమ వంతు ప్రచారం ప్రారంభించేసింది. చూడబోతే.. 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలో మధ్య పొత్తు ఉండదని అనిపిస్తున్నట్లుగా భాజపా నాయకులు ప్రచారం చేసేస్తున్నారు.

విశ్లేషకులు మాత్రం కాంగ్రెస్ పార్టీతో బంధం అంటే అఖిలేష్ కు అసహ్యం పుట్టిందేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా.. వారితో పొత్తును ఆయన వ్యతిరేకించారు. కాంగ్రెస్ తరఫున రాహుల్  వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దూతగా.. అఖిలేష్ తో భేటీ కావడానికి ప్రయత్నిస్తే.. అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు.

కానీ ములాయంసింగ్ ను కలసి తన ప్రతిపాదన ఏదో అఖిలేష్ చెప్పగలిగారు. అలాగే.. అఖిలేష్ ను కూడా చివరికి ఒప్పించగలిగారు. కానీ ఆ కూటమికి ఎన్నికల్లో సానుకూల ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ తో మైత్రి వల్ల తాము నష్టపోయినట్లుగా ఎస్పీ భావించడానికి ఒక ఆస్కారం చిక్కింది. ఇక ఒంటరిగానే ముందుకు వెళ్లాలని సైకిల్ పార్టీ ఎస్పీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.