Advertisement


Home > Politics - Gossip
అలర్ట్ చంద్రబాబు : పొత్తు కుదరకుంటే మేమూ పోతాం!

విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా సాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఇది మరొక హెచ్చరిక. అసలే వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడనే వార్తలతో.. ఆయన చికాకుకు గురవుతోంటే.. పార్టీలో మిగిలి ఉన్న మరికొందరు సీనియర్లు మరో రకం హెచ్చరికలతో ఆయనను బెంబేలెత్తించబోతున్నారు. తాము చెప్పిన ప్రతిపాదనలకు చంద్రబాబు ఒప్పుకోవాల్సిందే అని.. లేకపోతే.. తాము కూడా తమ దారి తాము చూసుకుంటాం అని వారు పార్టీలోని మిగిలిన నాయకులతోనే అంటున్నారు. 

మొత్తానికి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే సమయానికి తెలంగాణలోని పార్టీ వ్యవహారాలకు సంబంధించినంత వరకు, కేవలం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ మాత్రమే కాకుండా ఇంకా పెద్ద సంక్షోభమే ఆయన కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక తేదీలు, ముహూర్తాలు ప్రకటించడం ఒక్కటే తరువాయి. కేసీఆర్ అంటే ఉన్న అతి భయంకరమైన వ్యతిరేకత కారణంగా.. తాను రాజీనామా చేయడానికి అయినా సిద్ధపడి.. రేవంత్ ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ లోకి మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 

కేసీఆర్ ప్రభుత్వానికి, గులాబీ పాలనకు భరతవాక్యం పలకాలని, అది తన ద్వారానే జరగాలిన ఆయన పంతం పట్టినట్లుగా  కనిపిస్తోంది. కానీ రేవంత్ తో తీవ్రాతి తీవ్రంగా విభేదిస్తున్న తెలుగుదేశంలోని మరికొందరు సీనియర్ నాయకులు- కేసీఆర్ తోనే  పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం ఉంటుందని వాదిస్తునారు. కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే గనుక.. నికరంగా పార్టీకి కొన్ని సీట్లు వస్తాయని, కొన్ని మంత్రిపదవులు కూడా దక్కుతాయనే ఆలోచన వారిలో నడుస్తోంది. 

ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. గులాబీ పార్టీతో పొత్తుకు చంద్రబాబును ఒప్పించాలనే ఉద్దేశంతో వీరు ఉన్నారు. అయితే వీరిలో ఒక తిరుగుబాటు, ధిక్కార ధోరణి కూడా కనిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబునాయుడు గులాబీ పార్టీతో పొత్తులకు ససేమిరా అంటే గనుక.. తామంతా తెలుగుదేశాన్ని వీడి తెరాసలో చేరిపోవాలని వారు అనుకుంటున్నారట. ఏది ఏమైనా సరే.. పొత్తులకు అనుకూల నిర్ణయమే చంద్రబాబు తీసుకోవాలని, లేకుంటే పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

కొందరు సీనియర్లు.. ఒకవైపు గులాబీ బాస్ తో మంతనాలు కూడా పూర్తి చేసుకున్నట్లు.. పొత్తులు కుదిరినా.. పార్టీలో చేరినా.. తమకు కేటాయించే సీట్ల విషయం కూడా ఖరారు చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.