Home > Politics - Gossip
చంద్రబాబుపై అమరావతి మీడియాలో పొగలు సెగలు

చంద్రబాబునాయుడు వ్యవహార సరళి మీద.. అమరావతి మీడియా సర్కిళ్లలో ఇప్పుడొక హాట్ టాపిక్ నడుస్తోంది. ఆయన ఏ ప్రయోజనాలను ఎవరికి దోచి పెట్టినా.. చూసీ చూడనట్లుగా వ్యవహరించిన చాలా మంది మీడియా పెద్దలు, ఇప్పుడు తమకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ప్రత్యేకించి కొందరి చేతుల్లోనే పెట్టడాన్ని సహించలేకపోతున్నారు. పైగా అయినోళ్లకు దోచిపెట్టదలచుకుంటే.. అందుకు చంద్రబాబు ఇతర మార్గాలు చూసుకోవాలే తప్ప.. మీడియాకు సమష్టి ప్రయోజనాలు చేకూరాల్సిన చోట కూడా ఇలాంటి వక్రమార్గాలు తొక్కడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

చంద్రబాబునాయుడు మీడియా మేనేజిమెంట్ లో తిరుగులేని ఉద్ధండుడు అనేది అందరికీ తెలిసిన సంగతి. గతంలో తాను తొమ్మిదేళ్ల అధికారం నిర్వహించిన కాలం నుంచి కూడా జాతీయ వ్యాప్తంగా మీడియా మేనేజిమెంట్ ద్వారా సెలబ్రిటీ సీఎం స్టేటస్ సంపాదించుకోవడం ఎలాగో ఆనుపానులు ఆయనకు బాగా తెలుసునని అంతా అంటుంటారు. తెలుగుదేశం పార్టీ మీద గుత్తాధిపత్యాన్ని ఎన్టీఆర్ నుంచి తాను లాక్కున్నప్పుడు కూడా మీడియా మేనేజిమెంటే ఆయనను కాపాడిందనే పుకార్లు కూడా అప్పట్లో బాగా వినిపించాయి. 

అలాంటి టెక్నిక్ లను చంద్రబాబు ఇప్పటికీ మరచిపోలేదు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు.. అమరావతి నూతన రాజధాని నగరంలో మీడియా వారందరికీ త్రీబెడ్ రూం ఫ్లాట్ లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎటూ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. మీడియా వాళ్లకు ఇంటిస్థలాలు ఇవ్వడం సాధారణంగా జరుగుతున్న విషయమే. అయితే చంద్రబాబు ఫ్లాట్ ల ప్రామిస్ చేశారు. అయితే ఎవరెవరికి ఈ ఫ్లాట్ లు కేటాయించాలో తేల్చడానికి కొందరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేశారట.

ఆ కమిటీలో మాత్రం మెజారిటీ రెండు పత్రికలకు, ఒకే కులానికి చెందిన వారిని నియమించడం అనేది.. ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. చంద్రబాబు ఇళ్లు ఇవ్వదలచుకోవడం మంచి నిర్ణయమే గానీ.. మీడియా వాళ్లంతా కొందరి ఎదుట సాగిలపడాలన్నట్లుగా ఈ కమిటీ కూర్పు ఉన్నదనే అభిప్రాయాలు, ఒకే కులం చేతిలో పెట్టడం బాగోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈనాడునుంచి ఒకరు, ఆంధ్రజ్యోతి పత్రికనుంచి ఒకరు, ఏబీఎన్ ఛానెల్ నుంచి మరొకరు, ఇంకొందరు సభ్యులతో ఈ కమిటీ ఉన్నది. తనకు ఎంత అనుకూల గ్రూపు అయినప్పటికీ.. ఆంధ్రజ్యోతి గ్రూపు నుంచి ఇద్దరికి ఇవ్వడాన్ని  కూడా పలువురు తప్పుపడుతున్నారు. అయితే మీడియా అంటే అందరూ ముఖ్యమేనని, అందరిలోనూ తనకు మంచి పేరు ఉండాలని కోరుకునేట్లయితే... చంద్రబాబు ఈ కమిటీ కూర్పు విషయంలో పునరాలోచిస్తారో లేదో చూడాలి.