Advertisement


Home > Politics - Gossip
'అమ్మ' డెత్‌ మిస్టరీ.. వీడేదెప్పుడు.!

ఒకప్పటి సినీ నటి, తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత మరణించి నేటికి ఏడాది. మరణించి.. అంటే, అధికారికంగా వెల్లడించి నేటికి ఏడాది అన్న మాట.! 70 రోజులకు పైగా ఆసుపత్రిలో 'అత్యంత అనుమానాస్పద స్థితిలో' చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన జయలలిత, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేశారు. సినీ రంగంలో అయినా, రాజకీయాల్లో అయినా తనకు సాటి లేదన్పించుకున్న జయలలిత, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగారన్నది జగమెరిగిన సత్యం. 

వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాల్ని ఆమె ఎదుర్కొన్నారు. శోభన్‌బాబుతో సహజీవనం.. అంటూ ఇప్పటికీ జయలలిత గురించిన ప్రచారం జరుగుతోంది. శోభన్‌బాబు - జయలలిత 'కలయిక'కు తానే సజీవ సాక్ష్యమంటూ అమృత అనే యువతి మీడియా ముందుకొచ్చి నానా రాద్ధాంతం చేస్తోన్న విషయం విదితమే. రాజకీయాల్లో అయితే, అక్రమాస్తుల కేసులో ఆమె దోషిగా తేలారు. పలుమార్లు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. 'నిచ్చెలి' శశికళ ఇప్పుడు జైల్లో వున్నారంటే, అది జయలలిత అక్రమాస్తుల కేసు పుణ్యమే. అఫ్‌కోర్స్‌, శశికళ అక్రమాలే జయలలిత ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేశాయన్న వాదనలూ లేకపోలేదు. 

జీవితంలో 'పులిలా' బతికినా, చరమాంకంలో మాత్రం అత్యంత దయనీయ స్థితిలో జయలలిత కొట్టుమిట్టాడాల్సి వచ్చింది. కోట్లాదిమంది అభిమానులున్నా ఏం లాభం.? ఒంటరిగా నాలుగ్గోడల మధ్య ఆసుపత్రిలో జీవితం చివరి రోజుల్ని జయలలిత గలపడం ఆశ్చర్యకరం. ఆమెకు ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. కానీ, ఆమె మరణించారు. ఏడాది పూర్తయ్యింది జయలలిత మరణించారని ప్రకటించి. అప్పటికీ ఇప్పటి జయలలిత మరణం ఓ మిస్టరీనే. స్లో పాయిజన్‌ ఇచ్చి చంపేశారా.? అధిక బరువు ఆమె కొంప ముంచిందా.? తమిళనాడులో రాజకీయ సంక్షోభం కోసమే, ఆమెను హతమార్చే కుట్ర జరిగిందా.? కారణం ఏదైతేనేం, జయలలిత డెత్‌ మిస్టరీ ఎప్పటికీ వీడేది కాదు. 

జయలలిత మరణించిన ఏడాదికిగానీ ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. జయలలిత మరణానికి సంబంధించి నిజాలు నిగ్గుతేల్చేందుకోసమంటూ తమిళనాడు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏం తేల్చుతుంది.? జయలలిత డెత్‌ మిస్టరీ వీడేనా.? వేచి చూడాల్సిందే.