Advertisement


Home > Politics - Gossip
ఆయన చేరక ముందే... టీడీపీలో రచ్చ..!

ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. అనంతపురం టీడీపీలో గురునాథరెడ్డి రచ్చ రాజుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరుతున్న గురునాథరెడ్డి తమకు గర్వకారణమన్నట్టుగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. వైసీపీ నుంచి వస్తానంటున్న వాళ్లకు చంద్రబాబు దగ్గరుండి కండువాలు వేస్తున్నాడు కాబట్టి... మీడియా ఈ చేరికలను గట్టిగా సమర్థిస్తోంది.

బాబు మాటే శాసనం కదా! అయితే ఇప్పటికే అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయం రచ్చ రచ్చగా మిగిలింది, ఆ రచ్చలోకి ఇప్పుడు గురునాథరెడ్డి ఎంటరవుతున్నాడు. గురునాథరెడ్డికి, జేసీ దివాకర్ రెడ్డికి ఆది నుంచి సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయన స్వాగతించేశాడు. అంతేకాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మంటపెట్టేలా మాట్లాడాడు దివాకర్ రెడ్డి. ఇప్పటికే గురునాథరెడ్డి చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు ప్రభాకర్ చౌదరి. కానీ.. ఆయనది అరణ్యరోదనే అవుతోంది.

తాజాగా ఆయన మరోసారి స్పందించాడు. గురునాథరెడ్డి టీడీపీలోకి వస్తున్నది మిస్సమ్మ ట్రస్టు భూములను కాపాడుకోవడానికే అని తేల్చి చెప్పాడీయన. ఆ వివాద పరిష్కారానికే ఆయన టీడీపీలోకి వస్తున్నాడు.. అలాంటి వ్యక్తిని చేర్చుకోవడం బాధాకరం. మా పక్కన నిలబడే హక్కు కూడా ఆయనకు లేదని ప్రభాకర్ చౌదరి అన్నాడు. అంతేకాదు.. గతంలో కాంగ్రెస్ హాయాంలో బీఎన్ఆర్ ఫ్యామిలీ తెలుగుదేశం వాళ్లను తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని.. ఇప్పుడు బీఎన్ఆర్ తమ్ముడు టీడీపీలోకి రావడం దారుణమని కూడా ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించాడు.

ఈ విధంగా తెగ ఆవేదన భరితుడయ్యాడు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి చేరక ముందే ఇలా ఉంటే.. రేపు మాజీ ఎమ్మెల్యే టీడీపీలోనే ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యేనూ టీడీపీలోనే ఉంటే.. వీళ్ల లొల్లి మామూలుగా ఉండదని స్పష్టం అవుతోంది.