Advertisement


Home > Politics - Gossip
అయినవారికి దోచిపెట్టేందుకేనా.. అనంత మార్గం..!

చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రజలకు చాలా చాలా హామీలు ఇచ్చారు. వాటిలో అనంతపురం నుంచి అమరావతి దాకా మలుపుల్లేని.. చక్కగా సరళరేఖ లాగా ఉండే హైవేను నిర్మిస్తాం అనేది కూడా ఒకటి. ఈ రోడ్డు ప్రాజెక్టు గురించి చంద్రబాబు మామూలు స్థాయిలో ఊదరగొట్టలేదు. చాలా హైప్ సృష్టించారు. అయితే ఈ రోడ్డు నిర్మాణం సంగతి ఇప్పుడు డైలమాలో పడుతోంది. అవుతుందో లేదో అనే అనుమానాలు పుడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తమ  పార్టీ వారికి, తమకు కావాల్సిన వారికి అప్పనంగా లబ్ధి చేకూర్చేందుకు తెదేపా సర్కారు కొన్ని వక్రమార్గాలను అనుసరించే అవకాశం  కూడా ఉన్నదని జనం అనుమానిస్తున్నారు.

నిజానికి ఈ హైవే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. ఆ రకంగా గతంలో కేంద్రం ఒప్పుకుంది కూడా. అయితే తాజాగా కేంద్రంలో ఏపీ సర్కారు పట్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనికి పూర్తి సొమ్ము తాము ఇవ్వబోయేది లేదని.. స్థలసేకరణ రాష్ట్రప్రభుత్వమే పూర్తిచేసి తమకు అప్పగిస్తే.. నిర్మాణ బాధ్యతను మాత్రం తమ ఖర్చుతో చేస్తాం అని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్రప్రభుత్వం తమ ఖర్చుతో స్థలసేకరణ చేయడానికి తొలుత ఒప్పుకోలేదు. 

ఇక్కడే ఒక మడత పేచీ వచ్చింది. అనంతపురం- అమరావతి రోడ్డుకు సంబంధించిన ప్రకటన రావడానికంటె ముందే.. ఆ సంగతి తెలుసుకున్న తెలుగుతమ్ముళ్లు రోడ్డు రాగల మార్గం పొడవునా.. భూములు కొనేసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల రియల్ లావాదేవీలు నడిపించారు. రోడ్డు వస్తుందనే ప్రకటన రాగానే వాటి ధరలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి ఒప్పుకోకపోతే గనుక.. తెలుగుతమ్ముళ్లు దారుణంగా నష్టపోతారు. అలాంటి వారందరూ కలిసి చంద్రబాబు మీద వత్తిడి తెచ్చారు. అయితే చివరికి చంద్రబాబు వారి ఒత్తిడికి తలొగ్గారా అనిపించేలాగా.. రాష్ట్ర ప్రభుత్వమే స్థలసేకరణ చేయడానికి రెడీ అని ప్రకటించారు. 

అయితే ఇప్పటికీ మతలబు తొలగిపోలేదు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఏదో నామ్ కే వాస్తే చేసిన ప్రకటనే అని.. ఈ ప్రకటన సాకుతో తెలుగుతమ్ముళ్లంతా ఆ భూముల్ని మంచి లాభాలకు అమ్మేసుకుంటే.. ఆ తర్వాత రోడ్డు ప్రాజెక్టును అటక ఎక్కిస్తారని.. అప్పటిదాకా ఏదో ఒక రకంగా... హడావిడిచేస్తుంటారని రాజకీయ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. పాపం తెలుగు తమ్ముళ్లకు లబ్ధి కలిగించడానికి చంద్రబాబు చాలా పాట్లు పడుతున్నట్లుంది.