Home > Politics - Gossip
అంతలా ఆమెపై పగపట్టేశాడా.?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఎవరూ వుండరు. ఈ విషయం అందరికీ తెల్సిందే. చంద్రబాబుపై ఒకప్పుడు నిప్పులు చెరిగిన హరికృష్ణ, ఆ తర్వాత చంద్రబాబుతో కలిసిపోయారు. మళ్ళీ విమర్శలు చేశారు, మళ్ళీ కలిసిపోతున్నారు. ఒక కుటుంబంలోనే రాజకీయాలు ఇలా వుంటాయి. బయటి వ్యక్తుల సంగతి సరే సరి. రాజకీయ అవసరాలు తప్ప, రాజకీయంగా కక్షలు, కార్పణ్యాలు వున్నాసరే, రాజకీయంలోనే 'రాజీ' అనేది అంతర్భాగం. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు రాజీ ధోరణిలో ముందడుగు వేస్తోంది. ఆ పార్టీలోని రెండు వర్గాలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. ఇది బయటకు జరుగుతున్న ప్రచారం. అయితే, తెరవెనుక జరుగుతున్న వ్యవహారం వేరు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తన పంతం నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మొత్తంగా శశికళ వర్గమంతా, పన్నీర్‌ సెల్వం వైపు మళ్ళుతోంది. 

పార్టీ పెద్దలంతా కలిసి, 'సంక్షోభాన్ని' చల్లార్చేందుకు, పన్నీర్‌ సెల్వం వర్గంతో సమావేశమయ్యింది. ఇంకోపక్క, 'శశికళ పార్టీ అధ్యక్షురాలిగానే వుండాలి..' అంటూ దినకరన్‌ ఓ ప్రతిపాదన చేశారు. అయితే, ఈ ప్రతిపాదనే పన్నీర్‌ సెల్వంకి నచ్చడంలేదు. తాను పార్టీ నుంచి బయటకు వచ్చింది, 'జయలలితను చంపిన శశికళకు బుద్ధి చెప్పడానికి..' అంటూ తెగేసి చెబుతున్నారాయన. జయలలిత మరణంపై విచారణ జరగాల్సిందేనని పన్నీర్‌ సెల్వం డిమాండ్‌ చేస్తున్నారు. 

జయలలిత మరణం వెనుక 'హత్య కోణం' లేదని శశికళ వర్గం నమ్మితే, విచారణ పెద్ద వ్యవహారం కాదు. కానీ, విచారణకు ససేమిరా అంటున్నారంటే, శశికళ - జయలలిత మరణంలో కీలక భూమిక పోషించారనే భావించాలి. ఇక్కడే, శశికళను రాజకీయంగా 'గొంతు' నులిమేస్తున్నారు పన్నీర్‌ సెల్వం. పార్టీ అధ్యక్ష పదవి పన్నీర్‌ సెల్వంకి ఇవ్వడానికి అన్నాడీఎంకే పార్టీ సుముఖంగానే వుంది. కానీ, శశికళను ఏం చెయ్యాలట.? 

ఇదే ప్రశ్నకు పన్నీర్‌ సెల్వం దగ్గర కూడా సమాధానం వుంది. 'జయలలిత జీవించి వున్నప్పుడు, పార్టీ పరంగాగానీ.. ప్రభుత్వ పరంగాగానీ శశికళను దగ్గరకు చేర్చుకోలేదు. స్నేహితురాలిగానే జయలలిత వెంట శశికళ వున్నారు. ఇప్పుడూ అంతే..' అని పన్నీర్‌ సెల్వం స్పష్టం చేశారు. వామ్మో, అమాయకుడిగా కన్పిస్తాడుగానీ, కక్ష సాధించే నైజం పన్నీర్‌ సెల్వంలో ఏ స్థాయిలో వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.! 

ఇప్పుడిక వేరే దారి లేదు. అన్నాడీఎంకే పార్టీ ఒక్కటవుతోంది. పళనిస్వామి ముఖ్యమంత్రిగానే కొనసాగాలని పన్నీర్‌ సెల్వం అంటున్నారు గనుక వివాదం దాదాపుగా ముగిసినట్టే. శశికళ, ఆమె బంధువుల్ని పార్టీ దరిదాపుల్లోకి రాకుండా చెయ్యాలన్న పన్నీర్‌ సెల్వం డిమాండ్‌కీ ముఖ్యమంత్రి పళనిస్వామి అంగీకరించడం గమనార్హం.