Advertisement


Home > Politics - Gossip
ఏపీ కమలదళం : టార్గెట్ గవర్నర్!

ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ ఇప్పుడు ఒకటే ఎజెండా అంశంగా మారింది. గవర్నర్ నరసింహన్ ను ఏపీ బాధ్యతల నుంచి తప్పించాలని ఏపీ కమలనాధులు అందరూ కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల గవర్నర్ గా గురుతర బాధ్యతలు ఉన్నప్పటకీ.. గవర్నర్ ఏపీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఏపీలో కొద్ది సమయం కూడా గడపడం లేదని, రాష్ట్రప్రగతి మీద ఏమాత్రం శ్రద్ధలేని ఇలాంటి గవర్నర్ ను తొలగించి.. వెంటనే కొత్త గవర్నర్ ను నియమించాలని ఏపీ భాజపాలో డిమాండు హెచ్చుతోంది.

ఇన్నాళ్లూ ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు.. గవర్నర్ మీద ధ్వజమెత్తుతూ వచ్చారు. తాజాగా ఏపీ భాజపా అధ్యక్షుడు ఎంపీ కంభంపాటి హరిబాబు కూడా ఆయనతో గళం కలుపుతున్నారు.

ఏపీ భాజపాకు మొత్తంగా... గవర్నరు మీద ఇంత హఠాత్తుగా ఆగ్రహం ఎందుకు పుట్టుకొచ్చినట్లు? గవర్నర్ నరసింహన్ గత 43 నెలలుగా ఏనాడూ ఆంధ్రప్రదేశ్ ను ప్రేమగా చూసింది లేదు కదా..? ఇన్నాళ్లూ కనిపించని ఆయన మొక్కుబడి వ్యవహార సరళి.. వీరికి ఇప్పుడు మాత్రమే తెలిసి వచ్చిందా? లాంటి అనేకానేక సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ‘నాలా బిల్లు’ గవర్నరు వద్ద పెండింగులో ఉంది.

ఆ బిల్లు మీద సంతకం చేయకుండా, అది చట్టంగా మారకుండా గవర్నరు చాలారోజుల నుంచి సాగదీస్తున్నారు. భాజపా నాయకులు ఆ బిల్లు సంతకం కావడానికి ప్రయత్నించి విఫలమై ఈ ఆరోపణలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. గవర్నరును తొలగించండి అనే డిమాండు చేయకుండా.. ఏపీ అవసరాల మీద శ్రద్ధ పెట్టగలిగిన పూర్తిస్థాయి కొత్త గవర్నరును ఇవ్వండి అనే డిమాండుతో తెరపైకి వస్తున్నారు. గవర్నరు మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం అని కూడా అంటున్నారు.

గవర్నర్ ఏపీ పట్ల నిర్లక్ష్య వ్యవహార సరళి.. ఈనాడు కొత్తగా పుట్టుకువచ్చింది కాదు. హోదా పదేళ్లు ఇస్తాం అని చెప్పి భాజపా చేసిన మోసానికి ప్రజలు ఏ రకంగా అలవాటు పడ్డారో, అలాగే గవర్నర్ నిర్లక్ష్యానికి కూడా అలవాటుపడి సహించడం నేర్చుకున్నారు. చంద్రబాబునాయుడు అందరితోనూ సంయమనం మాత్రమే పాటిస్తూ ఉంటారు. అయితే.. భాజపా వారు మాత్రం ఇంత హఠాత్తుగా గవర్నర్ మీద ఆగ్రహంతో ఊగిపోతుండడం ఎందుకు జరుగుతోంది.

గవర్నర్ ప్రస్తుతం నాలా బిల్లు మీద సంతకం చేయలేదు. నాలా బిల్లు అంటే.. వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములుగా మార్చడానికి ప్రభుత్వం అనుమతించేందుకు సంబంధించిన బిల్లు. ఇది చట్టంగా మారితే.. వ్యవసాయభూముల ధరలు విచ్చలవిడిగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ ధరలు అమాంతం ఆకాశానికి పెరుగుతాయి... ఆ తర్వాత ఆకాశంలోనే ఉంటాయో.. కొన్నాళ్లాగి ఢామ్మని కిందకు పడతాయో తెలియదు.

అయితే  సదరు నాలాబిల్లుతో భాజపా వారి ‘కార్యకలాపాలు’, వ్యాపారాలు ఏమైనా ముడిపడి.. ఆయన సంతకం చేయకపోవడం వల్ల స్తంభించిపోయి ఉన్నాయేమో అని ప్రజలకు సందేహం కలుగుతోంది. 43నెలలుగా గవర్నర్ ఒకటే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంటే.. ఈ బిల్లు గొడవ మొదలైనప్పటి నుంచి భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఏకంగా ఆయనను మార్పించేస్తాం అనేంత దూకుడు చూపిస్తున్నారంటే.. ఏదో మతలబు ఉందని జనం అనుమానిస్తున్నారు.