Advertisement


Home > Politics - Gossip
ఏపీ భూముల్ని ఇక కారుచౌకగా దోచిపెట్టేస్తారా?

చంద్రబాబునాయుడు తాను తలచిన పనిని చక్కబెట్టుకోవాలంటే.. కొన్ని సందర్భాల్లో రివర్స్ స్క్రీన్ ప్లే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అయిన వారికి తలచిన ప్రయోజనాల్ని కట్టబెట్టే విషయంలో.. ఎవరూ పల్లెత్తు మాటలు అనకుండా ఉండేందుకు ఆయనకు చాలా సందర్భాల్లో ఈ రివర్స్ స్క్రీన్ ప్లే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఏపీలోని పరిశ్రమలకు అనువైన భూములను ఎవరికి కట్టబెట్టేయడం గురించి ఆయన ప్రణాళికలు రెడీగా ఉన్నాయో తెలియదు గానీ.. ఏపీఐఐసీ ద్వారా ధరలు తగ్గించేందుకు.. ఆయన వ్యూహాత్మకంగా అటునించి నరుక్కు వస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీలో పరిశ్రమల స్థాపనకు అనుకున్నట్లుగా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపించకపోవడానికి చంద్రబాబునాయుడు కొత్త కారణాలను వెతుకుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కారణాలను ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా... అక్కడ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువైన భూముల ధరల్లో కోత పెట్టేయడానికి... తద్వారా అయిన వారికి కట్టబెట్టేయడానికి ఒక వ్యూహం నడుస్తున్నదా అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. విషయం ఏంటంటే.. శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆయన పరిశ్రమలు రాకపోవడానికి సంబంధించిన సమస్యను ప్రస్తావించారు.

ఏపీఐఐసీ వారు భూముల ధరలను చాలా ఎక్కువగా చెబుతున్నారని, అందువల్ల ఏపీకి రాదలచుకున్న పరిశ్రమలు కూడా రావడం లేదని ఆయన పాపం.. వాపోయారు. అయినా ఏపీఐఐసీ ధరలు చెప్పడం అనేది ప్రభుత్వం పరిధిలో ఉండే అంశమేనా? కాదా? అనే అనుమానం ప్రజలకు కలిగే విధంగా ఆయన ఆవేదన కనిపిస్తోంది. 

నిజానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపించకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. పరిశ్రమలు పెట్టడానికి వస్తే ఇక్కడ అధికారులు, రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాలు, వాటాలు పంచవలసిన అవసరం.. ఇలాటి పరిస్థితులు ఉన్నా కూడా వారు ఉత్సాహం చూపించరు. అలాంటి ప్రతికూల పరిస్థితులు తమ పరిధిలో ఏమున్నాయో చెక్ చేసుకోకుండా.. ఏపీఐఐసీ హైదరాబాదులో కంటె ఎక్కువ ధరలు చెబుతున్నదనే సాకు చూపించడం కరక్టు కాదని పలువురు వాదిస్తున్నారు. నిజానికి పరిశ్రమల స్థాపనకు కావలసింది నగర వాతావరణం కాదు.. తతిమ్మా మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు.

సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్న ఏపీకి ఆ కోణంలోంచి చూసినప్పుడు ఎక్కువ అవకాశం ఉండాలి. అక్కడి భూములకు సహజంగానే ఎక్కువ విలువ ఉంటుంది. హైదరాబాదుకంటె ఎక్కువ ధరలు అని చంద్రబాబు.. ఏదో జనాంతికంగా అన్నారో లేదో ఆయన వద్ద ఆధారాలు ఉన్నాయో లేదో కానీ.. నిజానికి తీరానికి దగ్గరగా ఉండే భూములకు పరిశ్రమల పరంగా రేటు ఎక్కువే ఉంటుంది. ఆ విషయాన్ని పారిశ్రామిక వేత్తలకు నచ్చజెప్పి సాధించే ప్రయత్నం చేయాలి గానీ.. ప్రభుత్వాధినేత అయినప్పటికీ.. ప్రభుత్వ భూముల ధరలకు కోతపెట్టాలని అనుకుంటున్నట్లుగా చంద్రబాబు వైఖరి కనిపిస్తున్నదని పలువురు భావిస్తున్నారు.