Home > Politics - Gossip
కన్నడ సెగ.. ఏపీ ప్రభుత్వానికి ఉన్న అవగాహన ఇదీ!

కర్ణాటకలో తెలుగు విద్యార్థులపై దాడి జరగగానే.. ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ స్పందన బాగానే ఉంది కానీ, తలెత్తిన సమస్య విషయంలో బాబు ప్రభుత్వానికి అవగాహన లేదనే అంశం కూడా ఆ స్పందనతో స్పష్టం అయిపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో పోటీ పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయని, వారిని పరీక్ష రాయనీయకుండా వెనక్కు పంపాయని వార్తల నేపథ్యంలో ఏపీ మంత్రి వర్యులు ఒకరు స్పందిస్తూ.. ‘తెలుగు విద్యార్థులు బెంగళూరుకు వెళ్లి పరీక్షలు రాయల్సిన అవసరం లేకుండా చూస్తాం.. అమరావతిని అన్ని పరీక్షలకూ కేంద్రంగా మారుస్తాం..’ అని చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో ఐబీపీఎస్ తో రైల్వే రిక్రూట్ మెంటం బోర్డుతో చర్చిస్తాం.. అని సదరు మంత్రి వర్యులు చెప్పుకొచ్చారు. ఇదీ కథ. బెంగళూరులో దాడి ఎందుకు జరిగింది? అనే విషయంపై కనీస అవగాహన లేకుండా స్పందించింది బాబుగారి ప్రభుత్వం. పక్క రాష్ట్రాల వాళ్లు బెంగళూరు వేదికగా పరీక్షలు రాస్తున్నారని కన్నడీగ సంఘాలు దాడి చేయలేదు. తమ రాష్ట్ర కోటాలో వాళ్లు పరీక్షలు రాస్తున్నారు.. అని వారు దాడి చేశారు.

బెంగళూరు వేదికగా ఎగ్జామ్ మాత్రమే రాస్తే అభ్యంతరం లేదు..తెలుగు అభ్యర్థులు అప్లై చేయడమే కర్ణాటక కోటాలో చేస్తున్నారు. అక్కడ పోటీ తక్కువ అని, కటాఫ్ మార్కులు తక్కువని.. ఈ పని చేస్తున్నారు. అదే ఏపీ కోటాలో అప్లై చేస్తే పోటీ ఎక్కువ, మార్కులు ఎక్కువరావాలి.. కర్ణాటక అయితే సేఫ్.. అనేది మనోళ్ల లెక్క. ఇలా కర్ణాటక కోటాలో అప్లై చేసినప్పుడు.. ఎగ్జామ్ సెంటర్ ఆటోమెటిక్ బెంగళూరు అవుతోంది.

కర్ణాటక కోటాలో అప్లై చేసి.. విజయవాడలో ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ విషయంపై కనీస అవగాహన లేని మంత్రిగారు.. అమరావతిలో పరీక్ష కేంద్రం అంటూ మాట్లాడారు! ఇదీ జరుగుతున్న పరిణామాలపై మంత్రుల హోదాలో ఉన్న అవగాహన.