Advertisement


Home > Politics - Gossip
కొత్త సంవత్సరంలో ఏపీ పరిపాలన శవాసనం

కొత్త సంవత్సరం ప్రవేశించిన తర్వాత.. ఇప్పటిదాకా అమరావతి కేంద్రంగా ఏపీ పరిపాలన మొతం శవాసనం వేసినట్టుగా కనిపిస్తోంది. అమరావతిలో.. పరిపాలన కొత్త సంవత్సరం వచ్చిననాటినుంచి పూర్తిగా స్తంభించిందనే చెప్పాలి.

రాబోయే రోజులను లెక్కవేసినా కూడా.. మూడో వారం ముగిసే వరకూ మామూలు పరిపాలన మొత్తం పడకేసినట్టేనని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ముందుచూపు లేని ప్రభుత్వ కార్యక్రమాలు.. అవసరంతో నిమిత్తంలేని హడావుడి... అసలు పనుల మీద అశ్రద్ధ.. అన్నీ కలిసి ఇలాంటి పరిస్థితికి కారణమవుతున్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పనుల నిమత్తం అమరావతి సచివాలయానికి వస్తున్న వారికి ఈ నెలలో ఇప్పటిదాకా దిక్కూమొక్కూ లేకుండాపోతోంది.

వివరాల్లోకి వెళితే.. జనవరి రెండో తేదీనుంచే చంద్రబాబునాయుడు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడానికి, అర్జీలు తీసుకోవడానికి ఇది క్షేత్రస్థాయిలో మాత్రమే చురుగ్గా జరగాల్సిన కార్యక్రమం. కాగా.. సచివాలయంలో ఉండే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అందరినీ కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో ఏదో ఒక తీరుగా ఇన్వాల్వ్ చేశారు.

దాంతో ఉన్నతాధికారుల పరంగా సచివాలయం బోసిపోయినట్లుగా తయారైంది. మిగిలిన సచివాలయ ఉద్యోగులు కూడా సంక్రాంతి ముగ్గులు ఆటలపోటీలు అంటూ.. రోజూ ఆఫీసులకు వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ గడిపారే తప్ప.. పరిపాలన సాగింది మాత్రం లేదు. ఆరకంగా అటు మంత్రులు, నాయకులు లేక, సచివాలయంలో ఉన్నతాధికారులు లేక, ఉన్న ఉద్యోగులు  పనిచేయక మొత్తం వ్యవస్థ స్తంభించింది.

11వ తేదీ వరకు జన్మభూమి జరిగిన తర్వాత.. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. ఇక సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత.. అందరూ తిరిగి విధుల్లోకి వచ్చే సమయానికి ఈనెల 18 , 19 తేదీల్లో ఉన్న రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు, సదస్సు నిర్వహణ హడావుడి మొత్తం సాగుతుంది. ఆ వారం అలా మమ అనిపించేస్తారు.

ఈలోగా రిపబ్లిక్ డే వస్తుంది. రిపబ్లిక్ డేకు వివిధ శాఖల గణాంకాలు, శకటాలు తయారు చేయడం.. రాష్ట్రంలో అభివృద్ధి పరంగా జరిగిపోతున్న అద్భుతాలను నివేదించడం.. ఇదంతా కొన్ని రోజుల ప్రక్రియ.. ఇలాంటి అన్ని కారణాల నేపథ్యంలో.. నెలమొత్తం అసలు పరిపాలన  పనులకు తప్ప.. కొసరు పనులకే హవిస్సు అయిపోతున్నదని సచివాలయ అధికారులే చెబుతున్నారు.

పరిపాలనలో ప్రతిదీ డెడ్ లైన్ ప్రకారం జరగాల్సిందే.. ఏ విషయంలోనూ ఎలాంటి జాప్యాన్నీ సహించను, రియల్ టైం గవర్నెన్స్ చేయిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు.. సచివాలయంలో జరుగుతున్న ఇలాంటి కాలహరణం గురించి ఏం చెబుతారో.. ఎలా చక్కదిద్దుతారో చూడాలి.