Advertisement


Home > Politics - Gossip
సేనాని లేని సైన్యం.. యుద్ధం సాగించగలదా?

రాష్ట్రంలో అధికార- ప్రతిపక్ష పార్టీలు మామూలు రోజుల్లో ఎన్నెన్ని తిట్టుకున్నప్పటికీ.. చట్టసభ సాక్షిగా శాసనసభలో చేసుకునే విమర్శలు- ప్రతివిమర్శల స్థాయి వేరు. వాటివల్ల ఒనగూరే ప్రయోజనం కూడా వేరు. సభలో సరిగ్గా పోరాడితే.. ప్రభుత్వం ఎలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని కట్టడి చేయడానికి విపక్షానికి అవకాశం ఉంటుంది.

కానీ ఈసారి నవంబరు 8వ తేదీనుంచి ఏపీలో జరగబోతున్న శాసనసభ సమావేశాలు.. భిన్నమైన వాతావరణంలో ఉండబోతున్నాయి. విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్.. సేనాని లేని సైన్యం లాగా ఈ సభాసమరంలో తలపడబోతోంది. జగన్మోహన్ రెడ్డి పరోక్షంలోనే దాదాపుగా మొత్తం శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరి.. నాయకుడు లేకుండా.. చేసే పోరాటంలో.. వైకాపా ఎమ్మెల్యేలు తమ పోరాట పటిమను ఎలా నిరూపించుకుంటారో చూడాలి. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నవంబరు 2వ తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు నవంబరు 8వ తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అంటే.. ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కావడం అనేది సాధ్యం కాని పని. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించడానికి జగన్, సోమవారం నాడు హైదరాబాదు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వం మీద ఏయే ప్రజా అంశాల గురించి సభలో పోరాడాలో జగన్ మార్గ నిర్దేశనం చేస్తారు. అయితే జగన్ పరోక్షంలో సభలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎంత గట్టిగా, దృఢంగా తమ స్వరం వినిపించగలరు? ఎంత నిలకడగా పోరాడగలరు? అనేది అప్పుడే తేలదు. అసలే అధికార పార్టీపై ఎడాపెడా విరుచుకుపడుతూ విమర్శలు రువ్వే ఎమ్మెల్యే రోజా కూడా సభలో ఉండదు. ఆమె మీద నిషేధం ఇంకా తొలగిపోలేదు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ పోరాటం సాగించాలి. 

జగన్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్నారంటే పార్టీ ఎమ్మెల్యేలకు మరో ఒత్తిడి కూడా ఉంటుంది. ఆయన యాత్ర రాయలసీమనుంచే మొదలవుతోంది. తమ తమ ప్రాంతాలకు వచ్చే సమయానికి ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండడానికి వెళితే.. సభకు డుమ్మా కొట్టడమే జరుగుతుంది. ఆ రకంగా.. సభలో ఎమ్మెల్యేల బలం కూడా పుష్టిగా ఉండకపోవచ్చు. ఇలా ఏ రకంగా చూసినా.. ఈసారి ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో వైకాపా పోరాటం చాలా మందకొడిగా ఉంటుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అది నిజం కాకుండా, అందరూ పోరాట పటిమ ప్రదర్శిస్తే.. ప్రజాప్రయోజనాల పరంగా ఏమైనా మంచి జరుగుతుంది.