Advertisement


Home > Politics - Gossip
అశ్లీల వీడియో: ఖర్చు 2 కోట్లు.?

పటేల్‌ రిజర్వేషన్‌ కోసం పోరాడుతోన్న పటేదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కి సంబంధించి కొన్ని అశ్లీల వీడియోలు ఇంరట్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. గుజరాత్‌ ఎన్నికల వేళ ఈ వీడియోలు అత్యంత వ్యూహాత్మకంగా తెరపైకొచ్చాయన్నది నిర్వివాదాంశం. గుజరాత్‌ ఎన్నికల్లో 'పటేల్‌' సామాజిక వర్గ ఓట్లు అత్యంత కీలక భూమిక పోషించనున్న దరిమిలా, హార్దిక్‌ పటేల్‌ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయడమే లక్ష్యంగా ఆ వీడియోల్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. 

ఇక, ఈ వీడియోల వ్యవహారమై ఎట్టకేలకు హార్దిక్‌ పటేల్‌ పెదవి విప్పారు. ఆ వీడియోల్లో వున్నది తాను కాదని చెబుతూనే, 'అందులో వున్నది నేనా? కాదా?' అన్నది అనవసరమైన విషయమనీ, గుజరాత్‌ ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, పటేల్‌ రిజర్వేషన్‌ కోసం పటేల్‌ సామాజిక వర్గం ఎదురు చూస్తోందనీ, ఇలాంటి కీలకమైన అంశాల్ని ముందు పెట్టుకుని అశ్లీల వీడియోల పేరుతో తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయాలనుకోవడం రాజకీయంగా దిగజారుడుతనమేనని అంటున్నాడాయన. 

'నాకు 2 కోట్లు ఇస్తే, ఏ ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబందించిన అశ్లీల వీడియోల్ని అయినా రూపొందించగలను. మార్ఫింగ్‌ టెక్నాలజీ తెచ్చిన వెసులుబాటు ఇది..' అంటూ హార్దిక్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంటర్నెట్‌లో పెద్దగా ఖర్చు లేకుండానే మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. అలాంటిది, అశ్లీల వీడియోలు (మార్ఫింగ్‌ చేసినవి) సృష్టించడం కోసం 2కోట్లు ఖర్చవడమేంటట.? 

నిజమే మరి, అవి ఒరిజినల్‌ వీడియోలేనా.? డూప్లికేట్‌ వీడియోలేనా.? అన్న సంశయం కలగాలంటే, ఆ మాత్రం ఖర్చు చేయాలేమో.! అన్నట్టు, గుజరాత్‌ ఎన్నికల్లో హార్దిక్‌ పటేల్‌, కాంగ్రెస్‌కి మద్దతుగా నిలిచిన విషయం విదితమే. అశ్లీల వీడియోల విషయానికొస్తే, రానున్న రోజుల్లో మరిన్ని వీడియోల్ని విడుదల చేసి హార్దిక్‌ని ఇరుకున పెట్టాలని చూస్తోంది బీజేపీ. ఇప్పటికే, మూడు అశ్లీల వీడియోల్ని హార్దిక్‌పైకి సంధించారు గుజరాత్‌ కమలనాథులు.