Home > Politics - Gossip
'బాహుబలి' వచ్చేస్తున్నాడోచ్‌

'మాకూ ఓ బాహుబలి వస్తాడు..' అంటూ మొన్నామధ్య కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు నానా హంగామా చేశారు. 'మా పార్టీలో ఒక్కొక్కరూ ఒక్కో బాహుబలితో సమానం..' అంటూ, మరికొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మీడియా ముందు 'బాహుబలి' మేనియాలో మునిగి తేలారనుకోండి.. అది వేరే విషయం. కాంగ్రెస్‌ పార్టీని, తెలంగాణలో గట్టెక్కించే నాథుడే వుంటే.. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు.

కానీ, తప్పదు కదా.. పార్టీ తెలంగాణలో వుందని చెప్పుకోడానికి ఏదో ఒక హంగామా చేయాల్సిందే. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చేస్తున్నది కూడా అదే మరి.! టీడీపీ పూర్తిగా గల్లంతయ్యింది.. బీజేపీ, తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అదృష్టం కలిసొస్తే, టీఆర్‌ఎస్‌కి 2019 ఎన్నికల్లో ఫలితాలు వెక్కిరిస్తే, అప్పుడు అధికారం తమదేనన్నది కాంగ్రెస్‌ ఆశ. అదే, కాంగ్రెస్‌లో కాస్తో కూస్తో ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు నింపుతోంది.

ఇక, అసలు విషయానికొస్తే, అతి త్వరలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 'యువరాజు' రాహుల్‌గాంధీ, ఈ బహిరంగ సభకు సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ కానున్నారు. సంగారెడ్డిలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభను కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 'మా బాహుబలి రాహుల్‌గాంధీనే..' అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంటున్నారు.

రాజీవ్‌గాంధీ, రాజకీయాల్లో 'బాహుబలి' అయితే, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడీ గడ్డు పరిస్థితి ఎందుకు వస్తుందట.? ఆయన ఎక్కడ అడుగు పెడితే, అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గల్లంతయిపోతుందాయె. కానీ, ఆయనే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి 'బాహుబలి' అట. బాహుబలి తర్వాత.. కాంగ్రెస్‌ పార్టీ బలప్రదర్శన అయినా, ఆశించిన స్థాయిలో జరుగుతుందా.? అన్నదిప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.