Home > Politics - Gossip
బాబోయ్‌.. మహానాడు...!

మహానాడు విశాఖలో ఏర్పాటుచేయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అడిగాను, ఆయన దయతో ఈ అవకాశం మన  ప్రాంతానికి ఇచ్చారంటూ జిల్లాకు చెందిన మంత్రి సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు గొప్పగా చెప్పుకున్నారు, కానీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఇదేం తలనొప్పిరా బాబూ అంటున్నారు. పదమూడేళ్లుగా ఖర్చు తప్ప పార్టీ నుంచి తమకేం లబ్ధి కలిగిందని వారు నిష్టూర మాడుతున్నారు. నామినేటెడ్‌ పదవులు ఇప్పిం చడం చేతగాదు కానీ, తమ ఆర్భాటం కోసం మంత్రులు మహానాడు వేదికను విశాఖకు తీసుకువచ్చారని దిగువ స్ధాయి నాయకత్వం విమర్శిస్తోంది. చేతి చమురు వదిలించుకోవడం తప్ప తమకు ఎటువంటి గుర్తింపు ఉండదని, వేదికను ఎక్కిన మంత్రులే క్రెడిట్‌ అంతా కొట్టేస్తా రని అక్కసు వెళ్లగక్కుతున్నారు.

ఇదిలా ఉండగా, మహానాడు కోసం పదిహేను కమిటీలను వేశారు, అందులో పార్టీ నాయకులను, ముఖ్య కార్యకర్తలను నియమించి పనులు చూడమంటున్నారు. ప్రతీ రోజూ మహానాడుపై సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పార్టీ పరంగా నిధులు ఎంత మేరకు వస్తాయో, అవి ఎవరి చేతులకు చిక్కుతాయో తెలియదు కానీ, తమకు మాత్రం అటు ఖర్చుతో పాటు, ఇటు శ్రమ కూడా తప్పేట్లు లేదని పసుపు పార్టీ తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ఎమ్మెల్యే గణేష్‌కుమార్‌ కూడా పదవీ వైరాగ్యం ప్రకటిస్తున్నారు.

గత నాలుగైదేళ్లుగా పార్టీ అధ్యక్షునిగా చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఈ దఫా తాను పోటీ చేయదలచు కోలేదని చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం బాగోగులు చూసుకుంటానని,  అదే ప్రశాంతంగా ఉంటుందని కూడా అంటున్నారు. నగరం మొత్తం పార్టీపరంగా అలకరించే బాధ్య తను తీసుకున్న వాసుపల్లి  ఏదోలాగా మహానాడు పూర్తయితే చాలునన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ పదవిపై కన్నేసిన తూర్పు ఎమ్మెల్యే సన్నిహిత బంధువు పట్టాభి మాత్రం తెగ హాడావుడి చేయడం ద్వారా అధినాయకత్వం దృష్టిలో పడాలని చూస్తున్నారు. మొత్తం మీద మూడు రోజుల మహానాడుతో తమ మాడు పగిలేలా ఉందని సగటు టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.