Advertisement


Home > Politics - Gossip
బాబు తీరు వల్లనే తెలుగుదేశం ఇలా..!

మొన్న బుచ్చయ్య చౌదరి, నిన్న ఎంపీ శివప్రసాద్.. చాలా సీరియస్ గా బాబు మీద ధ్వజమెత్తారు. ఈ జాబితాలో బోండా ఉమ, చింతమనేని, బొజ్జల వంటి వారు ఉన్నా.. వీరంతా ఉత్తుత్తి అసంతృప్తులు. తొలి రోజు ధ్వజమెత్తి.. రెండో రోజు సర్దుకున్నారు. చచ్చే వరకూ పార్టీలోనే అంటూ..ఒక పడికట్టు ప్రకటన చేసేశారు. వీరి సంగతి అటుంచితే.. తెలుగుదేశం పార్టీలో బాబంటే లెక్కలేని తనం పెరిగిపోతోంది…ఇది స్పష్టంగానే అర్థం అవుతోంది.

ఎందుకు లెక్కచేయాలి? అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేతలు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది… అయినప్పటికీ.. అవతల బాబేమో మరో పాతికేళ్లు మాదే అధికారం అంటున్నారు. మరి పాతికేళ్ల అధికారం, వచ్చే ఎన్నికల్లో గెలుపు.. వంటి మాటలపై కనీసం పార్టీలోని నేతల్లో నమ్మకం కలిగించాలి చంద్రబాబు నాయుడు. కానీ ఈ మాటలను పార్టీలోని వారే విశ్వసించడం లేదు. ఫలితంగానే ఈ ధిక్కార స్వరాలు!

పార్టీ మళ్లీ గెలుస్తుందనే నమ్మకం చాలా మంది లో లేకపోవడంతోనే… అధికార వ్యవధి మరో రెండేళ్లు ఉండగానే పార్టీలో రచ్చ రేగుతోంది. ఏపీ ప్రతిపక్ష పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోతున్నారంటే.. తెలంగాణలో తెలుగుదేశాన్ని వీడి చాలా మంది వెళ్లారంటే.. వాటిలో ఒక అర్థం ఉంది. అధికారంపై మొహం వాచి ఉండటం, ఇప్పటికిప్పుడు అధికార పార్టీలోకి వెళితే ఫలానావి దక్కుతాయనే నమ్మకంతో అలాంటి ఫిరాయింపులు జరిగాయి. అవి కూడా ఇప్పుడు ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీలో అయితే ఇప్పుడు తెలుగుదేశాన్ని వీడతాం.. అని ప్రకటనలు చేసే వాళ్లే కానీ, తెలుగుదేశంలోకి చేరతాం.. అని మాట్లాడే వాళ్లు లేకుండా పోయారు! ఎన్నికలకు రెండేళ్ల ముందే ఇలాంటి పరిస్థితా!

వైకాపాలోకి వెళతాం.. మాకు అక్కడా పరిచయాలున్నాయి అని తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు బాహాటంగా చెబుతున్నారు. వైఎస్ తోనే మాకు సాన్నిహిత్యం ఉందంటున్నారు.. ఇంకొందరు ఎలాగూ జనసేనలోకి వెళతారులే.. అనే భావనను కలిగిస్తున్నారు.

ఏతావాతా.. అధికారంలో ఉన్న దర్పం కానీ, బాబు హుకుంను పాటించే వారు కానీ.. బాబంబే బీభత్సమైన భయభక్తులు ప్రదర్శించే వాళ్లు కానీ తెలుగుదేశంలో కనిపించడం లేదు. అవతల తెలంగాణలో కేసీఆర్ పార్టీనే కాదు, రాష్ట్రాన్నే గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఇక ఎంతమంది పార్టీ వీడినా.. బయటకు వెళ్లిన వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లు కూడా జగన్ పై పేలడానికి సిద్దంగా లేరు.

ఎటొచ్చీ అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి మీద.. ఆయన తీరు మీద.. అదే పార్టీ వాళ్లు రచ్చకు ఎక్కి.. మాట్లాడుతున్నారు. ఆయన సరిగా నడుచుకోవాలని హెచ్చరించడం వరకూ వెళ్లింది కథ. మొన్న బుచ్చయ్య చౌదరి మాటలు విన్నా, నిన్న ఎంపీ శివప్రసాద్ మాటలు విన్నా.. బాబుకు వాళ్లు గట్టిగానే క్లాస్ పీకారు. చంద్రబాబు వ్యవహరణ తీరు వల్లనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలా తయారవుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.