Advertisement


Home > Politics - Gossip
ప్రయత్నం బాగుంది.. ఫలితం ఏదండీ..?

చంద్రబాబునాయుడు అమెరికాలో మూడు రోజుల పాటు తన పర్యటనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉన్న అనేక మందిని కలిశారు. భారత్ లో పెట్టుబడులకు ఆసక్తి ఉంటే..అందుకు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎలా అనువైన ప్రాంతం అవుతుందో.. తన అభిప్రాయాలను వారికి చెప్పారు. అనుమతుల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సమస్తం ఆన్‌లైన్ లోనే అనుమతులు తీసుకునేలా ఏర్పాట్లు ఉన్న సంగతిని కూడా వివరించారు.

ఏదో ఒకటి రెండు పెద్ద కార్యక్రమాల్లో సంఖ్యాపరంగా ఎక్కువ మందిని కలవడం కాదు.. సంఖ్యాపరంగా ఎక్కువ సమావేశాల్లో కూడా పాల్గొంటూ ఆయన అనేక మందితో భేటీ అయి.. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులతో రావడం గురించి విజ్ఞప్తి చేశారు. ఇంతవరకూ చంద్రబాబునాయుడు ప్రయత్నం బాగానే ఉంది. కానీ దీని ఫలితం ఏమైంది? కనీసం ఒక్కటంటే ఒక్కటైనా పరిశ్రమ రావడానికి నిర్దిష్టమైన హామీ లభించిందా? ఒక్క అడుగైనా ముందుకు పడినట్లు సంతోషించే సందర్భం ఒక్కటైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. చంద్రబాబు చెప్పిన ‘ఎడ్వాంటేజీ’ల గురించి అంతా విని వెళ్లారే తప్ప.. దానిని నమ్మి పెట్టుబడులకు తాము రెడీ అని నమ్మకంగా చెప్పిన వారు ఒక్కరు కూడా లేరు.

పెద్ద స్థాయిలో పెట్టుబడుల సదస్సులను నిర్వహించి, వందల మంది పారిశ్రామికవేత్తలు అందులో పాల్గొన్న తర్వాత.. లెక్కకు మిక్కిలిగా ఎంఓయూలు చేసుకున్న తర్వాత కూడా.. ఇవాళ్టి రోజుల్లో పరిశ్రమలు కార్యరూపం దాల్చడం లేదు. అలాంటిది కేవలం విదేశీ పారిశ్రామికవేత్తలు కొందరితో జరిగిన చిన్న చిన్న భేటీల్లో.. ఇక్కడ ఉండే అవకాశాల గురించి చెప్పేసి వచ్చినంత మాత్రాన పెట్టబుడులు వచ్చేస్తాయా? అనేది ప్రశ్న.

అయితే ప్రయత్నలోపం లేకుండా చంద్రబాబునాయుడు.. తన గురించి తానే చెప్పుకుంటున్నట్లు... ఒక మార్కెటింగ్ మేనేజర్ లాగా కష్టపడుతున్నారు. మరో రకంగా చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి ఇంటింటికీ తిరిగి ప్లాట్లు కొనుక్కోమని చెప్పే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా కష్టపడుతున్నారు. అయితే వారికి లాగానే.. చంద్రబాబునాయుడుకు కూడా పెద్దగా ఫలితం లభించడం లేదు. తన ప్రయత్నాలు పరిశ్రమల రూపంలోకి మారడం లేదు. 

ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. చంద్రబాబునాయుడు వైఫల్యం కూడా అందులో ఒకటి. ముఖ్యమంత్రి అంటే ఏదో మన రాష్ట్రప్రభుత్వ పెట్టుబడుల విభాగానికి సేల్స్ మ్యాన్ కాదు. ఆయనతో భేటీ ఏర్పాటు అవుతున్నదంటే ముందస్తుగా చాలా సన్నాహాలు ఉండాలి. ఏపీలోని సానుకూల అంశాల గురించి.. ఆయన చెప్పే అంశాలను ముందుగానే ఎవరైనా ఆయా పారిశ్రామికవేత్తలకు తెలియజెప్పి.. అవి రుచించి ఆసక్తి చూపిస్తున్న వారిని మాత్రమే చంద్రబాబు భేటీని ఏర్పాటుచేయాలి.

దానివల్ల సీఎం స్థాయిలో వారికి తగిన భరోసా మాటలు చెప్పి.. పెట్టుబడులు పెట్టించవచ్చు. కానీ ఒక పద్ధతి, వ్యూహం లేని ఎప్రోచ్ కారణంగా.. చంద్రబాబు ఎంత కష్టపడుతున్నప్పటికీ.. అది బూడిదలో పోసిన పన్నీరే అవుతోందని అనిపిస్తోంది. తప్పు ఎవరిదైనా రాష్ట్రానికి ఎలాంటి నిర్దిష్టమైన హామీ లేకుండానే.. ముఖ్యమంత్రి అమెరికా యాత్ర ముగియడం ప్రజలకు కూడా బాధాకరమే.