Home > Politics - Gossip
బాబు మెడకి చుట్టుకోనున్న 'హవాలా'

'దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నాం..' అంటూ ఓ పక్క ప్రధాని నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టుకి సంబంధించి నిధులు పక్కదారి పట్టిన వైనంపై కాగ్‌ కడిగి పారేస్తే, అంతకు ముందే విపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తే, 'తూచ్‌.. అదంతా హంబక్‌..' అని అధికార తెలుగుదేశం పార్టీ లైట్‌ తీసుకుంది. అప్పుడే, మిత్రపక్షం బీజేపీ - టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 

తాజాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ - దేశంలోనే 'హవాలా రాష్ట్రం'గా వార్తల్లోకెక్కుతోంది. మొన్న విశాఖ, ఇప్పుడు విజయవాడ.. హవాలా కారణంగా వార్తల్లోకెక్కిన దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌ పరువు గంగలో కలిసిపోయింది. పైగా, ఈ హవాలా కుంభకోణాల్లో అధికార పార్టీకి చెందిన నేతల తాలూకు సన్నిహితులే కీలక భూమిక పోషించడంతో మిత్రపక్షం బీజేపీ గుస్సా అవుతోంది. వ్యవహారం, బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్ళకుండా వుంటుందా.? 

ఇంకేముంది.. రేపో మాపో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం, ప్రధానికి రాష్ట్రంలో పరిస్థితులపై వివరణ ఇచ్చుకోవడం జరుగుతుందనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అవినీతి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లోనే వెల్లువెత్తుతున్నాయి. పైగా, హవాలా కుంభకోణాలు 'బోనస్‌' అన్న మాట. మిగతా విషయాలెలా వున్నా, 'హవాలా' అన్న పేరే.. రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేస్తుంది. అలాంటిది ఒక్కటితో ఆగలేదు, ఒకదాని వెంటనే ఇంకోటి వెలుగుచూసింది. 

ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారు.? చంద్రబాబు ఎలా తనను తాను సమర్థించుకుంటారు.? ఇప్పటిదాకా విపక్షం మీద ఎదురుదాడితో సరిపెట్టిన టీడీపీ, మిత్రపక్షం నుంచి 'హవాలా' విషయమై ప్రశ్నాస్త్రాలు దూసుకొస్తే ఏం సమాధానమిస్తారు.? ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు మెడకి హవాలా వ్యవహారాలు గట్టిగానే చుట్టేసుకున్నాయి. తమ ప్రభుత్వ చేతకానితనంపై చంద్రబాబు ఏం బుకాయించినా ఉపయోగం లేదిప్పుడు.