Advertisement


Home > Politics - Gossip
బాబుకి షాక్‌: గడ్కరీ చేతుల్లోకి 'పోలవరం'

'పోలవరం ప్రాజెక్ట్‌ బాధ్యత నాదే.. నా హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేస్తాం.. రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. 2018 నాటికి గ్రావిటీతో నీళ్ళు.. 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవడం ఖాయం..' 

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల తర్వాత చాలా చాలా సందర్భాల్లో చెప్పిన మాటల సారాంశమిది.

కానీ, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌. ఆ లెక్కన, పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ, జాతీయ హోదా పొందకముందు పోలవరం రాష్ట్ర ప్రాజెక్ట్‌ కావడంతో, జాతీయ హోదా దక్కిన తర్వాత కేంద్రం ఇచ్చే నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ పనుల్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. 'మేమే చేస్తాం..' అని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో, కేంద్రం తెలివిగా చేతులు దులిపేసుకుంది. 

ఇప్పుడు సీన్‌ మారింది. 'మీరే పూర్తి చేస్తామంటే, ప్రాజెక్ట్‌ మీకే ఇచ్చేస్తాం..' అంటూ చంద్రబాబు, అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో కేంద్రం అలర్ట్‌ అయినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు కేంద్రం సిద్ధమయినట్లుగా కన్పిస్తోంది. 'ప్రాజెక్ట్‌ నిర్మాణం అనుకున్న సమయానికి ఎలా పూర్తి చేయించాలో నాకు తెలుసు..' అన్న వ్యాఖ్యలు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నుంచి వచ్చాయంటే, చంద్రబాబు సర్కార్‌కి ఏ స్థాయిలో కేంద్రం షాక్‌ ఇవ్వబోతోందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీకాదు. 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, 2014 ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో 'కదలిక' వేగవంతమయ్యిందన్నది వాస్తవం. కేంద్రం మీద నమ్మకంతో, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల్నీ ఎక్కువగానే ఖర్చు చేసింది. కానీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాల్సిన స్థాయిలో రాలేదన్నదీ నిర్వివాదాంశం. మరిప్పుడు ఏమవుతుంది.? పోలవరం ప్రాజెక్ట్‌ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్న చంద్రబాబు చేతుల్లోంచి, కేంద్రం ఆ ప్రాజెక్ట్‌ని లాగేసుకుంటే.. చంద్రబాబు పరిస్థితి ఏంటట.? 

ఒక్కటి మాత్రం నిజం.. ఇక్కడ చంద్రబాబు ఇమేజ్‌ పూర్తిగా డ్యామేజీ అయిపోయింది. చంద్రబాబు అసమర్థతని కేంద్రం ఎత్తిచూపుతోంది. తప్పదు మరి, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆవేశపడినందుకే ఈ ఝలక్‌.