Advertisement


Home > Politics - Gossip
బాబుని కడిగేసిన పవన్‌.. ఉత్తుత్తినే.!

పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరగడంలేదని చంద్రబాబు ప్రభుత్వం గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా.? 

ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం సాధ్యమేనా.? 

మాంఛి విందు భోజనం పెడతామని చెప్పి, ఆవకాయ బద్ద నాకించినట్లుంది కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరు.! 

పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా.? కేంద్రం ఎన్ని నిధులు ఇస్తోంది.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఎలా సద్వినియోగం చేస్తున్నారు.. వంటి విషయాలపై చేతనైతే శ్వేతపత్రం విడుదల చేయండి.! 

వామ్మో.. ఒక్కసారిగా చంద్రబాబు మీద పవన్‌కళ్యాణ్‌ ఇన్ని ప్రశ్నలు సంధించేస్తే ఎలా.? చంద్రబాబు తట్టుకోవద్దూ.! ఒకదాని తర్వాత ఒకటి.. ఎడా పెడా పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబుని కూడా ప్రశ్నించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆగండాగండీ, అంతలా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇదంతా 'ఉత్తుత్తి' వ్యవహారమే. ఎందుకంటే, చంద్రబాబు - పవన్‌కళ్యాణ్‌ మధ్య 'దోస్తీ' వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే కదా.! 

కేంద్రాన్నీ ప్రశ్నించేసి, జగన్‌నీ ప్రశ్నించేసి.. చంద్రబాబుని ప్రశ్నించకపోతే ఎలా.? అందుకే, పవన్‌కళ్యాణ్‌ కాసిని విమర్శల్ని చంద్రబాబు కూడా విసిరేశారు. చంద్రబాబు ఊరుకుంటారా.? ఆయనా ఘాటుగానే స్పందించారు. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తున్నాం, అంతా ఆన్‌లైన్‌లోనే వ్యవహారం నడుస్తోంది.. ఇంకా వైట్‌ పేపర్‌ దేనికి.? అంటూ ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్న చందాన ఇటు పవన్‌నీ, అటు వైఎస్‌ జగన్‌నీ కడిగి పారేసేందుకు చంద్రబాబు ప్రయత్నించడం గమనార్హం. 

పోలవరం ప్రాజెక్ట్‌కి అవసరమైన నిధులు ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది. బీజేపీ నేతలదీ అదే మాట. చంద్రబాబేమో, 'మీరిలా చేస్తే, ప్రాజెక్ట్‌ పూర్తవదు.. మీరే తీసేసుకోండి, సకాలంలో పూర్తి చెయ్యండి..' అంటూ కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై అసెంబ్లీ సాక్షిగా అసహనం వ్యక్తం చేసేస్తుంటారు. అందరూ శాఖహారులే, కానీ గంప కింద కోడిపెట్ట మాయమైపోయి, దాని ఈకలు మాత్రమే మిగిలాయంటే, ఏమనుకోవాలట.! 

మూడున్నరేళ్ళ తర్వాత పవన్‌కళ్యాణ్‌ పరిగెత్తుకుంటూ పోలవరం ప్రాజెక్ట్‌ దగ్గరకు వెళ్ళడమేంటోగానీ, పవన్‌కళ్యాణ్‌కి చంద్రబాబు డైరెక్షన్‌లో సకల మర్యాదలూ అక్కడి అధికారులు చేసినా, చంద్రబాబుని ఆయనగారు విమర్శలతో చెడుగుడు ఆడేశారాయె. దానికి చంద్రబాబూ కౌంటర్‌ ఇచ్చేశారాయె. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవన్‌కళ్యాణ్‌ భలే చక్కగా నటించేయగలడు. అవును మరి, అక్కడున్నది ఆషామాషీ డైరెక్టర్‌ కాదు.. నిప్పు నారా చంద్రబాబు డైరెక్షన్‌ సీట్‌లో కూర్చున్నారాయె.!