Home > Politics - Gossip
బాలయ్య శాసిస్తారు.. చంద్రబాబు పాటిస్తారు!

మూడు సంవత్సరాల నంది అవార్డులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా ఎంపిక కమిటీలను ఏర్పాటుచేసింది. అయితే ఈ కమిటీల కూర్పులో అచ్చంగా సాంతం నందమూరి బాలకృష్ణ ముద్ర కనిపిస్తున్నదని అటు అమరావతి రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ఫిలింనగర్ వర్గాల్లోనూ చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా అవార్డుల వ్యవహారానికి సంబంధించినంత వరకూ బాలయ్య ఎంత చెబితే అంతగా.. ఆయన మాటను చంద్రబాబు పాటిస్తున్నట్లుగా కమిటీల కూర్పు ఉన్నదని అంతా అనుకుంటున్నారు. 

మొత్తంగా ప్రస్తుతం 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించి మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వీటికి జీవిత, పోకూరి బాబూరావు, గిరిబాబు అధ్యక్షులుగా ఉంటారు. అలాగే సభ్యుల ఎంపికలో కూడా దాదాపుగా బాలయ్య ముద్ర కనిపిస్తున్నదనేది సమాచారం. 

మరో తమాషా ఏంటంటే.. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. నందమూరి తారక రామారావు అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తుంటుంది. ఈ అవార్డులను ఇవ్వడానికి ఒక్కో అవార్డు ఎంపిక కు ఒక్కో సంవత్సరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ట్విస్టు ఏంటంటే.. ఎన్ టి రామారావు అవార్డు ఎంపికకు ఎంపిక చేయడానికి మూడు సంవత్సరాల కమిటీలకూ నందమూరి బాలకృష్ణ సారధిగా ఉంటారు. రెండు సంవత్సరాల కమిటీలోల మురళీమోహన్ ఒక సభ్యుడు. 

మొత్తానికి బాలయ్య మాట వేదవాక్కుగా సాగినట్టుగా కమిటీల కూర్పు ఉన్నదంటూ సర్వత్రా వినిపిస్తోంది. అవార్డుల ఎంపిక మొత్తం ఈ కమిటీల ఆధ్వర్యంలోనే సాగుతుంది. నాణ్యత, నిబంధనలు లాంటి పెద్ద పట్టింపులేమీ లేకుండా.. తమకు కావాల్సిన వారికి కట్టబెట్టడంలోనూ ఈ కమిటీలే కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందుకే కమిటీలనే అయినోళ్లకి అప్పగించారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.