Home > Politics - Gossip
భళా.. బాబు గెలిపించేశాడలా.!

'వావ్‌.. పార్టీ నేతలంతా అద్భుతంగా పనిచేశారు.. భలేగా గెలిపించేశారు.. కలిసి పనిచేస్తే మనదే విజయం.. గెలుపు తర్వాత అలసట ఏమాత్రం వద్దు.. నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయండి..' 

- కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల సారాంశమిది.

మరీ ముఖ్యంగా, కడప జిల్లాలో పార్టీని గెలిపించినందుకుగాను, మంత్రి గంటా శ్రీనివాసరావుపై ప్రశంసలతో ముంచెత్తారట చంద్రబాబు. అసెంబ్లీలో, ఈ రోజు చంద్రబాబు చాలా హుషారుగా కూడా కన్పించారు. ఎంత హుషారుగా అంటే, గతంలో ఎన్నడూ లేనంతగా. కారణం, కడపలో వైఎస్సార్సీపీకి షాక్‌ ఇవ్వగలమని బహుశా చంద్రబాబు కలలో కూడా ఊహించి వుండరు మరి.! 

నిజానికి కడప సహా కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సంఖ్యా బలం పరంగా చూసుకుంటే, ఈ మూడు స్థానాల్లోనూ వైఎస్సార్సీపీనే గెలవాల్సి వుంది. కానీ, మూడింటినీ టీడీపీ గెల్చుకుంది. అదెలా.? అనడక్కండి. అదంతే. క్యాంపు రాజకీయాలు నడిచాయి, బెదిరింపులు కొనసాగాయి.. ఇంకా చాలా చాలానే జరిగాయి. ఇన్ని జరిగాక టీడీపీ గెలవకుండా వుంటుందా.? 

'మేం గెలిచేశాం..' అని చెప్పుకోవడం వరకూ బాగానే వుంది. ప్రజలు తమ వెంట నిలిచారని టీడీపీ నేతలు చెప్పుకోవడమే పెద్ద కామెడీ.! పైగా, తమ పాలనకు ఈ ఎన్నికలు రిఫరెండం.. అని కొందరు నేతలు అత్యుత్సాహంతో మాట్లాడేస్తున్నారు. రిఫరెండం.. అంటే, జనం ఓట్లేయాలి. ఇక్కడ ఓట్లేసింది జనంకాదు, ప్రజా ప్రతినిథులు. పైగా, 'అవగాహన' పేరుతో క్యాంప్‌ రాజకీయాలు నడిచాక, అక్కడ ఏ అవగాహన వారిలో అధికార పార్టీ కల్పించిందో అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు ప్రజలు. 

అన్నట్టు, మంత్రి గంటా శ్రీనివాసరావుకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రమోషన్‌ ఇవ్వనున్నారట. మంత్రి వర్గంలో ఇంకా కీలకమైన శాఖకు ఆయన్ను చంద్రబాబు ప్రమోట్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటిదాకా ఇదే గంటా తీరుపై గుస్సా అయిన చంద్రబాబు, కడప ఎన్నికల తర్వాత వున్నపళంగా తన అభిప్రాయాన్ని మార్చేసుకున్నారట. అంటే, త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగనున్న దరిమిలా, గంటా శ్రీనివాసరావు పంట పండినట్లే.