Advertisement


Home > Politics - Gossip
భూమా కుటుంబం ఆస్తులన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయా..?

నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి పాత్ర చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకూ నంద్యాల ఆవలి వాళ్లకు సుబ్బారెడ్డి ఎవరో పెద్దగా తెలీదు. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఒకవేళ భూమా మరణానంతరం అఖిలప్రియకు, సుబ్బారెడ్డికి అంతా బాగుండి ఉంటే ఆయన పేరు అంత ప్రాచూర్యంలోకి వచ్చేది కాదు. అయితే అఖిల, సుబ్బారెడ్డిల మధ్య విబేధాల నేపథ్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దానికితోడు సుబ్బారెడ్డి నంద్యాల్లో హల్‌చల్‌ చేస్తున్న తీరుతో మరింత పేరొస్తోంది ఆయనకు.

ఈయన భూమా నాగిరెడ్డికి బాగా కావాల్సిన వ్యక్తి అని, ఒకదశలో సుబ్బారెడ్డి, నేను ఒకటే తప్ప.. వేర్వేరు కాదని భూమా నాగిరెడ్డే అనేవాడని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే అఖిల మాత్రం సుబ్బారెడ్డికి అంత విలువనివ్వడం లేదనేది వార్తల్లోని అంశమే. మరి భూమా నాగిరెడ్డి మరణించిన వెంటనే సుబ్బారెడ్డితో అఖిలప్రియకు ఎందుకు విబేధాలు మొదలయ్యాయి? ఎందుకు వివాదాలు తలెత్తాయి? అంటే ఆస్తుల గొడవ అనేమాట వినిపిస్తోంది.

భూమా ఆస్తుల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తుల్లో సుబ్బారెడ్డి ప్రథముడు.. అనేది లోకల్‌గా వినిపిస్తున్న మాట. ఆఖరికి బతికున్న రోజుల్లో శోభా నాగిరెడ్డికి తెలియని వివరాలు కూడా సుబ్బారెడ్డికి తెలుసని అంటారు. శోభ మరణించారు, ఆ తర్వాత నాగిరెడ్డి మరణించారు. తల్లి మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చిన అఖిలకు కొంతవరకూ అవగాహన ఏర్పడింది. తమ ఆస్తులెక్కడున్నాయి, ఏయే దాంట్లో పెట్టుబడులున్నాయి వంటి విషయాలపై ఆమెకు అవగాహన వచ్చిందంటారు.

అయితే తండ్రి బతికున్నంత వరకూ అఖిల ప్రియకు ఆస్తుల విషయంలో డైరెక్ట్‌ ఇన్‌వాల్వ్‌ మెంట్‌ లేదు, కానీ ఆయన చనిపోయాక మాత్రం ఎలాగూ తప్పలేదు. ఇక్కడే సుబ్బారెడ్డి తీరు అఖిలప్రియను అసహనానికి గురి చేసిందని టాక్‌. ప్రత్యేకించి భూమాకు ముఖ్యంగా ఉండిన కేబుల్‌, పాల వ్యాపారం సుబ్బారెడ్డి చేతిలో ఇరుక్కుపోయిందని.. దీంతో పాటు బోలెడంత క్యాష్‌ కూడా సుబ్బారెడ్డే సొంతం చేసుకున్నాడనేది నంద్యాల టాక్‌. భూమా ఆస్తుల గుట్లూమట్లూ తెలిసిన సుబ్బారెడ్డి.. నాగిరెడ్డి మరణానంతరం చాలా మొత్తాన్ని వెనకేసుకున్నాడని నంద్యాల టీకొట్ల వద్ద జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

ఇక భూమా కేబుల్‌ వ్యాపారం.. అదో పెద్ద సామ్రాజ్యమే. కర్నూలు జిల్లాలో సగం వరకూ కేబుల్‌ విషయంలో భూమా ఆధిపత్యం ఉంది. భూమా వైకాపాలో ఉన్న రోజుల్లో టీడీపీ వాళ్లు ఈ వ్యాపారంపై దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. భూమా టీడీపీలోకి చేరాకా.. ఆ ప్రమాదం తప్పింది. ఈ కేబుల్‌ వ్యవహారాలను గతంలో సుబ్బారెడ్డే చూసేవాడట.. నాగిరెడ్డి మరణానంతరం వీటి వివరాలు అఖిలప్రియకు అస్సలు తెలపడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక విఖ్యాత్‌ పేరుతో నడుస్తున్న(జగత్‌ విఖ్యాత్‌ భూమా కొడుకుపేరు) వ్యాపారాలకు భూమా వారసులే డైరెక్టర్లుగా ఉన్నా, వారి పేరుతోనే వ్యవహారాలు సాగుతూ ఉన్నా.. ఆర్థిక వ్యవహారాలు అన్నీ సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే నడిచాయట. నాగిరెడ్డి మరణానంతరం వీటి విషయంలోనూ అఖిలప్రియకు క్లారిటీ ఇవ్వడంలేదట సుబ్బారెడ్డి.

ఇలా కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలు, తమ కుటుంబ ఆర్థిక సామ్రాజ్యం అంతా సుబ్బారెడ్డి గుప్పిట్లో ఇరుక్కుందని గ్రహించిన అఖిలప్రియ ఈ విషయంలో మనశ్శాంతిని కోల్పోయిందని సమాచారం. అందుకే .. 'మామ' అని పిలిచే సుబ్బారెడ్డిపై ఆమె నమ్మకం కోల్పోయిందని తెలుస్తోంది.

ఈ విషయంలో చెలరేగిన మనస్పర్థలు, గొడవే భూమా ఫ్యామిలీకి సుబ్బారెడ్డిని దూరం చేసిందని నంద్యాల జనాలు అంటున్నారు. మరి ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి విజయం కోసం సుబ్బారెడ్డి ప్రచారం చేస్తున్నాడు కదా.. అంటే, సుబ్బారెడ్డి మొహాన్ని చూసి.. ఓట్లేసే వాళ్లు ఉన్నారా? అని నంద్యాల జనులే ఎదురు ప్రశ్నిస్తున్నారు!