Home > Politics - Gossip
భూతద్దంలో చూస్తున్న సాక్షి

ఎదుటివాడు కిట్టకపోతే, ప్రతీదీ భూతద్దంలో కనిపిస్తుంది.  వైకాపాతో పరోక్ష సంబంధాలున్న సాక్షి ఓ పత్రిపక్ష పత్రికగా మంచి పోరాటమే సాగిస్తోంది. కానీ ఆ క్రమంలో కొన్ని మరీ లాజిక్ లు లేని మ్యాజిక్ ల్లాంటి కథనాలు అల్లుతోంది. ఈ రోజు సాక్షి అందించిన స్టార్..స్టార్ కథనం అలాగే వుంది. విజయవాడలో రెండు వందల కోట్ల విలువైన విద్యుత్ శాఖ భూమిని 99 ఏళ్ల లీజుకింద కార్పొరేట్ హోటళ్ల కంపెనీకి ఇచ్చి, కొన్నేళ్ల తరువాత దాన్ని చినబాబు లోకేష్ కు ఇచ్చేలా పేద్ద స్కెచ్ వేసారన్నది ఆ కథనం సారాంశం.

విద్యుత్ శాఖ భూమిని, ఆ శాఖకు ఎన్నో అవసరాలు వుండగా ఫ్రయివేటు సంస్థకు లీజుకు ఇచ్చేస్తున్నారని ఆవేదన వక్యం చేసారు. కానీ అమరావతిలో రాజధాని వస్తుంది. అక్కడ ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఏం చేస్తారు? విద్యుత్ శాఖ కేంద్ర కార్యాలయమో, శిక్షణాలయమో మరోటో పెట్టుకోవచ్చు. విజయవాడ సెంటర్ లో వున్న భూమిని హొటల్ కు ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. అయితే అడ్డగోలుగా తక్కువకు ఇచ్చేయడం, లేదా అప్పనంగా ఇచ్చేయడం లేదా, ఏకపక్షంగా ఒకే కంపెనీని పిలిచి అప్పగించేయడం చేస్తే అప్పుడు తప్పు పట్టాలి. కానీ అలాంటివి ఏవీ ఇంకా జరగలేదు. కేవలం అసలు ఎంత భూమి వుంది అన్న కొలతల కార్యక్రమం మాత్రమే జరుగుతోంది.

ఇదిలా వుంటే ఇప్పుడు ప్రైవేటు కార్పొరేట్ సంస్థకు ఇచ్చి, కొనేళ్ల తరువాత చినబాబుకు ట్రాన్స్ ఫర్ చేసేలా లోపాయి కారీ ఒప్పందం కుదుర్చుకున్నారని అంటున్నారు. ఇది భలే జోక్ అనుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఇలాంటి లోపాయి కారీ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అప్పుడు కూడా వ్యక్తులు మాట మీద వుంటారన్నది గ్యారంటీ లేదు. కార్పొరేట్ కంపెనీ ఇలా తీసుకుని, అలా కొన్నేళ్ల తరువాత ఇచ్చేంత సీన్ వుండదు. దానికి సవాలక్ష పద్దతులు వుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు, షేర్ హోల్డర్లు ఇతరత్రా.

అది అలా వుంచితే, అయిదేళ్ల తరువాత రాజెవరో? బంటు ఎవరో? ఈ ప్రభుత్వం లేకపోతే ఆ కార్పొరేట్ సంస్థ చినబాబునైనా, మరెవరినైనా ఎందుకు కేర్ చేస్తుంది? వైఎస్ టైమ్ లో ఇలా లోపాయి కారీ ఒప్పందాలు చాలా వుండేవని టాక్. ఇప్పుడు వాళ్లంతా జగన్ కు హ్యాండిచ్చేసారు. తెలుగుదేశం పంచన చేరిపోయారు. జగన్ ఏమన్నా చేయగలిగారా? రాష్ట్రంలోని లీడింగ్ సెజ్ అప్పట్లో అడుగుకు పది పైసలు వంతున నెల నెలా వైఎస్ కు ఫండ్ ఇచ్చేలా లోపాయి కారీ ఒప్పందం కుదుర్చుకుందని టాక్. అలాగే ఆ ప్రభుత్వం వున్నన్నాళ్లు ఇచ్చిందనీ అంటారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? అదేదో అధికారంలో వున్నావారికి ఇస్తుంది. రేపు జగన్ అధికారంలోకి వస్తే అక్కడ ఇస్తుంది.

విజయవాడలో విలువైన జాగాను తక్కువకో, ఫ్రీగానో ఇచ్చేస్తే కచ్చితంగా ఎత్తి చూపవచ్చు. వార్తలు వండి వార్చవచ్చు. కానీ దానికి మరీ మసాలా జోడించి చినబాబును లాగేయడం అంటే మరీ కాస్త భూతద్దంలో చూస్తున్నారు అనుకోవాలి.