Home > Politics - Gossip
అటునుంచి నరుక్కు వచ్చారా...?

ఎక్కడ తాము బలహీనంగా ఉన్నామో... అక్కడ బలం పెంచుకోవడం మీద దృష్టి పెట్టడం అనేది సాధారణమైన యుద్ధనీతి. అందుకు అనేక పద్ధతులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో బలం కలిగిఉన్న వారిని తమ ఆశ్రితులుగా మార్చుకోవడం, కుదరని పక్షంలో బలంగా ఉన్న వారిలో చీలిక తేవడం వంటి పద్ధతులు. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కారు కూడా అదే పోకడ అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నాయకుడు ముకుల్ రాయ్ రాజీనామా మరియు భాజపా లో చేరే వ్యవహారం ఇలాంటి యుద్ధ నీతినే తలపిస్తోంది.

2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవడం గురించి భాజపా చాలా బలంగానే ఆలోచిస్తోంది. ఇప్పటివరకూ తమ బలాన్ని నిరూపించుకుని విజయం సాధించిన రాష్ట్రాల్లో చేపడుతున్న పనులన్నీ ఒక ఎత్తు అయితే.. అదే మాదిరిగా.. తమ ప్రత్యర్థులు బలంగా ఉన్నచోట్ల వివిధ వ్యూహాలను అనుసరిస్తోంది. దక్షిణాదిలో పార్టీకి ఉన్న బలహీనతలను దృష్టిలో పెట్టుకుని... తెరాసతో కూడా మైత్రీ బంధాన్ని పెంచుకుంటూ, మరొకవైపు తమిళనాడులో పాలకపక్షం అన్నాడీఎంకేను తమ కూటమిలోనే చేర్చుకుంది.

మోడీ అంటేనే ఒంటికాలిపై లేచే నితీశ్ కుమార్ జేడీయూను కూడా కూటమిలో కలిపేసుకుంది. ఇక భాజపా వారి వ్యూహ చాతుర్యానికి లొంగకుండా ఉన్నది తృణమూల్ కాంగ్రెస్ మరియు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మాత్రమే. ఇప్పుడు అక్కడ కూడా వీరి పాచిక పారింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ రాజీనామా చేసేశారు. భాజపాలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

ముకుల్ రాయ్ కొన్నాళ్లుగా భాజపా దిశగా అడుగులు వేయడం జరుగుతోంది. పార్టీలో  మమత తర్వాత అంతటి సీనియర్, కీలక నాయకుడు అయిన ముకుల్ రాయ్ చేరిక భాజపాకు కచ్చితంగా లాభిస్తుంది. అందుకే మమతా బెనర్జీని లొంగదీసే మార్గాలు లేక.. ఫైనల్ ఎటెంప్ట్ గా ఆ పార్టీలోనే చీలక లేదా ఒక వర్గాన్ని తమలో కలిపేసుకోవడం వంటి ప్రయత్నాలపై భాజపా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.