Advertisement


Home > Politics - Gossip
టీటీడీ బోర్డు ప్రతిష్టంభన భాజపా పుణ్యమే!

టీటీడీ ధర్మకర్తల మండలి పదవులు ఖాళీ అయి.. దాదాపుగా ఏడాది కావస్తోంది. అయినా కొత్త బోర్డు ప్రకటన మాత్రం ఇప్పటిదాకా తేలలేదు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు ఈ పదవి కట్టబెడతారని ఇప్పటికి పలుమార్లు ‘అధికారిక లీక్’ లు వచ్చాయి. ప్రతిసారీ మరో నాలుగైదు రోజుల్లో జీవో వచ్చేస్తుందనే మాట పత్రికల్లో రావడమే తప్ప.. ఇప్పటి దాకా జీవో రాలేదు. అసలే రెండేళ్లు మాత్రమే ఉండే బోర్డు పదవీ కాలం.. ఇప్పటికే ఒక ఏడాదికి కుంచించుకుపోయింది. అయినా సరే.. ఇంకా జీవో విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదంటే.. అందుకు భారతీయ జనతా పార్టీ మొండి పట్టుదలే కారణం అని అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి.

సాధారణంగా టీటీడీ బోర్డులో 18మంది వరకు అవకాశం కల్పించవచ్చు. అయితే ఈసారి ఏర్పాటు చేయబోతున్న బోర్డులో తమకు ఆరుగురు సభ్యుల కోటా కావాలని భారతీయ జనతా పార్టీ పట్టుపడుతున్నదిట. పైగా దేవాదాయ శాఖను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన పైడికొండ మాణిక్యాల రావు చూస్తున్నారు. మన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖలో కూడా మన పార్టీ హవా నడవకపోతే.. పరువునష్టం అని భాజపా భావిస్తున్నదిట. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీకి చెందిన వారికి ఆరు సభ్యత్వాలను కేటాయించాలనే డిమాండ్  వారినుంచి వినిపిస్తోంది. ముగ్గురికి అవకాశం కల్పించడానికి చంద్రబాబు సుముఖంగానే ఉన్నారు గానీ.. ఆ విషయం తేలకపోవడం వల్లనే జీవో విడుదల జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.

అదే విధంగా.. పుట్టాసుధాకర్ యాదవ్ కు తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ గిరీ కట్టబెట్టడం పై కూడా భాజపా-ఆరెస్సెస్ వర్గాలనుంచి వ్యతిరేకత ఉన్నదనే వార్తలు వస్తున్నాయి. క్రైస్తవ మత సంస్థలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుధాకర్ యాదవ్ ను గత బోర్డు ఏర్పాటు సమయంలో సభ్యుడిని చేయడమే పెద్ద వివాదంగా మారింది. అలాంటిది.. ఈసారి ఏకంగా ఛైర్మన్ చేయాలని నిర్ణయించడంపై భాజపా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. భాజపా కాస్త మెత్తబడితే.. వెంటనే జీవో వచ్చేస్తుంది. కానీ ఈ అవకాశాన్ని వాడుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాండ్ ను నెరవేర్చుకోవాలని భాజపా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.