Home > Politics - Gossip
రెంటికీ చెడ్డ రేవడి అవుతున్న వైకాపా ఎంపీగారు..!

ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమనే అంతా అనుకుంటున్నారు.. వైకాపా వాళ్లకు కూడా ఆమె మీద ఆశలేమీ లేవు. ఆమె వీడిపోతే పోయిందిలే.. అనుకుంటున్నారు. ఎలాగూ ఆమెను కర్నూలు నుంచి పోటీ చేయించాలని జగన్ కు లేదని స్పష్టం అయిపోయింది కూడా. అంతిమంగా ఎమ్మెల్యే టికెట్ ను ఆఫర్ చేస్తున్నారట.. ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయండనే ఆఫర్ ను ఇస్తున్నారని ఇది వరకే స్పష్టం అయ్యింది.

అయితే తనుకు కర్నూలు నుంచినే పోటీ చేయాలని ఉందని బుట్టారేణుక స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వెళ్లి నారా లోకేష్ బాబుతో కలవడంతో.. కథ క్లైమాక్స్ కు వచ్చింది రేణుక జంపే అని అంతా అనుకన్నారు. అయితే ఆమె మళ్లీ మీడియా ముందుకు వచ్చారు.. తను వైకాపాను వీడటం లేదని చెప్పుకొచ్చారు. లోకేష్ ను మర్యాదపూర్వకంగానే కలిశారని రేణుక చెప్పుకురావడమే ఇక్కడ కామెడీ. తన గురించి దుష్ప్రచారం జరుగుతోందని.. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని.. రేణుక చెప్పుకొచ్చారు!

 మరి ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఈ ఎంపీగారు.. అందునా కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక వేడి ఉండగా.. వెళ్లి లోకేష్ బాబుతో సమావేశం అయ్యి.. అబ్బే, అదంతా మర్యాదపూర్వకమే.. అంటే వినే జనాలు ఏమైనా చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నారా? ఈమె వైకాపాలో ఉంటారా, ఉండరా.. అనేది ఇక్కడ సమస్య కాదు కానీ.. రేణుక రెంటికీ చెడ్డ రేవడీ అవుతున్నారని మాత్రం స్పష్టం అవుతోంది.

ఎంపీగా గెలిచినప్పటి నుంచి తడబాటు అడుగులే వేస్తున్న రేణుక.. ఇప్పుడు కూడా అదే రీతిన తడబడుతోందని తేటతెల్లం అవుతోంది. మరి వైకాపా వాళ్లు నిన్నటి వరకూ ఎమ్మిగనూరు టికెట్ ను అయిన ఆఫర్ చేశారామే.. ఇక ఆ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. మరి రేణుకను తెలుగుదేశం అయినా ఆదరిస్తుందా? అంటే.. చెప్పలేం! నంద్యాల ఉప ఎన్నికల వరకే రేణుక అవసరం టీడీపీకి ఉంది.

అది కూడా నంద్యాల్లో ఈమె గెలిపించేస్తుందని కాదు.. ఈమెకు పచ్చకండువా వేసేసి.. చూశారా... చంద్రబాబు పాలనకు మెచ్చి వైకాపా ఎంపీ వచ్చి తెలుగుదేశంలో చేరిందని చెప్పుకోవడానికి మాత్రమే. తెలుగుదేశం ఆ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటోంది. అది నంద్యాల ఉప ఎన్నికల లోపు మాత్రమే.. ఈ పోల్స్ ముగిసిన తర్వాత రేణుక అవసరం టీడీపీకి కూడా లేదు..!