Advertisement


Home > Politics - Gossip
బీజేపీ.. ఇలాగైతే కష్టం కాదా..?

నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు, ఇప్పుడు వీహెచ్ కూడా గుచ్చాడు.. ఈ పాటికే విషయంలోని సీరియస్ నెస్ కమలనాథులకు అర్థం అయి ఉండాలి. తమ ద్వంద్వ వైఖరి గురించి వారికి క్లారిటీ వచ్చి ఉండాలి. ఒకవైపు తెలంగాణలోని కమలనాథులేమో.. కేసీఆర్ ను తిట్టి పోస్తున్నట్టుగా కనిపిస్తారు. కానీ ఢిల్లీ వాలాలు వచ్చి మాత్రం కితాబులు ఇచ్చి వెళ్తారు. కేసీఆర్ కేకో కేక అని చెప్పి వెళ్తారు.

ఇక ఈ విషయంలో కేసీఆర్ ఏమీ తక్కువ కాదు.. ఢిల్లీకెళ్తే మోడీ కేకో కేక అంటాడు. మోడీని ఆకాశానికెత్తుతాడు. ఇందు మూలంగా అందరికీ అర్థం అయ్యేది ఏమిటి? టీఆర్ఎస్, బీజేపీ భాయీ..భాయీ అని కాదా? ఈ విషయాల్లో ప్రచారం ఎంత వచ్చిందో ఎవరికి తెలియనిది? తెరాస కేంద్ర కేబినెట్ లో చేరనుందనే ప్రచారం కూడాచాన్నాళ్లుగానే జరుగుతోంది కదా.

మరి ఇదంతా అందరి కళ్ల ముందు జరుగుతున్న వ్యవహారమే.. కానీ ఇంత జరుగుతుంటే, కమలనాథులు మాత్రం తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం అని అంటారు! తమ మాటలు వినే జనాలు.. మరీ పిచ్చోళ్లు అని కమలనాథుల లెక్క కావొచ్చు. తామే సన్నిహితంగా ఉంటూ, తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొంటూ కమలనాథులు పబ్బం గడుపుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకోవాల్సిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటని అంటున్నారు. ఇక్కడ అధికారమే అందుకోవాలని అంటున్నారు. మరి.. అలాంటి లక్ష్యాలు ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలు మంచివేనా? కమలం ప్రత్యామ్నాయ శక్తి గా ఎదగడం మాట అటుంచి.. ఇప్పుడు సీట్లలో కూడా చాలా వరకూ వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకోవడం కూడా కష్టం అయిపోవడం ఖాయం.