Advertisement


Home > Politics - Gossip
‘సోమిరెడ్డి నోటికి తాళం వేయించలేరా?’

ఏదో పెళ్లికి వచ్చిన అతిథితో కాసేపు మాట్లాడినందుకు పార్టీ పరువు పోతున్నదంటూ పయ్యావుల కేశవ్ మీద తమ అధినేత చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు కదా.. మరి అంతకంటె ఎక్కువగా తన డైలాగులతో పార్టీ పరువు తీసేస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి నోటికి అధినేత తాళం వేయించలేడా? అని తెలుగుదేశం సీనియర్ నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నారు.

తాజాగా ఏపీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి.. రాంగోపాల్ వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మాటలన్నీ రోడ్డున పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న సామెత చందంగా ఉన్నదని పార్టీ సీనియర్ నాయకులు తమ ప్రెవేటు సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ చేయదలచుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశం తనను వరించకపోవడంతో.. రాంగోపాల్ వర్మ.. తనంత తానుగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయబోతున్నట్లుగా ప్రకటించి.. కొన్ని రోజులుగా టాలీవుడ్ లోను, రాజకీయ వర్గాల్లోనూ ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి చాలా సున్నితమైన అంశం కావడంతో పాటు, రాజకీయంగా తమ పార్టీ మీద, అధినేత చంద్రబాబు మీద బుదర పడే అవకాశం మెండుగా ఉండడంతో.. ఈ సినిమా విషయంలో తెలుగుదేశానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. పైగా రాంగోపాల్ వర్మ తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడేసి.. వ్యవహారాన్ని రచ్చ రచ్చ చేసేస్తాడనే భయం కూడా అందరికీ ఉండనే ఉంది. 

అయితే ఇలాంటి ముందు వెనుకలు చూసుకునే అలవాటు లేనట్లుగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు ఈ అంశంపై స్పందించారు. రాంగోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మీపార్వతినే హీరోయిన్ గా పెట్టుకుని చేసుకుంటే సరిపోతుందని, వేరే హీరోయిన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన వెటకారం చేశారు. అలాగే.. ఈ చిత్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డే అనే సంగతిని కూడా వర్మ అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని కూడా మరో సెటైర్ వేశారు సోమిరెడ్డి.

ఈ సినిమా వ్యవహారంలో పార్టీ నేతలందరూ నోరు కట్టేసుకుని మాట తూలకుండా అదుపు పాటిస్తూ ఉంటే సోమిరెడ్డి ఇలా ఎడాపెడా చేసిన వ్యాఖ్యానాలు పార్టీలు చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ సినిమాకు అనవసరంగా సోమిరెడ్డి హైప్ క్రియేట్ చేసి అదనపు ప్రచారం కల్పిస్తున్నారని, ఈ వ్యాఖ్యలపై మళ్లీ వర్మ ఓవర్ గా స్పందించడమూ.. ఆరకంగా పార్టీని బజారు కీడ్చడమూ జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే చంద్రబాబు సోమిరెడ్డి నోటికి తాళాలు వేయలేకపోయారా.. ఆయన మాటలు చాలా సందర్భాల్లో బ్యాక్ ఫైర్ అవుతున్నాయి అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. 

అయినా ఒక్క చేతిని గాల్లో ఊపితే.. చప్పట్లు కొట్టిన చప్పుడు రాదు. రెండు చేతులూ కలవాల్సిందే. ఇప్పటిదాకా వర్మ ఏకపక్షంగా దాని గురించి మాట్లాడగా అంశం నెమ్మదిగా మరుగున పడిపోతున్నదని.. ఇప్పుడు సోమిరెడ్డి అనవసరంగా దాన్ని కెలికి మళ్లీ పతాకశీర్షకిల్లోకి వచ్చేలా చేశారని పలువురు అనుకుంటున్నారు.