Advertisement


Home > Politics - Gossip
కేసీఆర్‌ను పవన్ ఇప్పుడూ పొగడగలడా?

ఇది బ్రహ్మాండమైన ట్విస్టే.. పవన్ కల్యాణ్ మంత్రాంగం పని చేసి ప్రీమియర్ షోలకు అనుమతి లభిస్తుంది అనుకుంటే.. ఇది ఏపీ కాదు రా భై, తెలంగాణ.. అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. న్యూ ఇయర్ విషెష్ చెప్పినా.. తెలంగాణలో విద్యుత్ సరఫరాను పొగిడినా.. మొహమాటపడం అన్నట్టుగా వ్యవహరించింది తెలంగాణ సర్కార్. పవన్ కల్యాణ్ వెళ్లడం, వెయిట్ చేయడం, విషెష్ చెప్పడం.. పొగిడేయడం అయ్యింది. అప్పుడే తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

కనీసం తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు అనుకున్న పవన్ కల్యాణ్ కేసీఆర్ ను కూడా తను చంద్రబాబును పొగిడినట్టుగా పొగడటంతో అంతా ఆశ్చర్యపోయారు. ప్రశ్నించడానికే పార్టీ అని చెప్పుకుని మరీ అధికారంలో ఉన్న వారికి పవన్ సాగిలాపడటంతో చాలా మంది నిశ్చేష్టులయ్యారు. ఒకవేళ పవన్ కల్యాణ్ మిగతా అంశాలన్నింటిలోనూ ప్రశ్నించి, విద్యుత్ విషయంలో మాత్రం కేసీఆర్ ను పొగిడి ఉంటే అదో లెక్క.

తెలంగాణలో బోలెడన్ని సమస్యలు ఉంటే.. వాటిలో వేటి గురించి స్పందించే తీరిక లేని పవన్ కు.. కొత్త సంవత్సరం విషెష్ చెప్పడానికి, ఒక ప్రోగ్రామ్ ను పొగడటానికి మాత్రం తీరిక దొరికిందప్పుడు. అందుకు ప్రతిఫలంగా.. పొగడ్తలకు బదులుగా పవన్ కల్యాణ్.. తన తాజా సినిమా ప్రీమియర్స్ కు అవకాశాన్ని సంపాదించుకున్నాడనే ప్రచారం జరిగింది. అయితే చివరకు అది బుడగలా తేలిపోయింది.

మరి పవన్ ఏం అడిగాడు? కేసీఆర్ ఏం చెప్పాడు? అసలు వాళ్లిద్దరూ ప్రీమియర్ షోల గురించి మాట్లాడారా? అనేదంతా వదిలేద్దాం. ఇక మళ్లీ పవన్ కల్యాణ్ రాజకీయ నేతగా మీడియా ముందుకు వచ్చినప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఎలా రియాక్ట్ అవుతాడు? కేసీఆర్ పాలన మీద ఎలా స్పందిస్తాడు? మొన్న పొగిడినట్టే.. పొగుడుతాడా? లేక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఝలక్ తో ఉడికిపోతూ.. రేపు మళ్లీ మీడియా ముందుకు వచ్చినప్పుడు విరుచుకుపడతాడా? అనేవి ఆసక్తిదాయకమైన విషయాలు.

పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు అని గతంలో మాట్లాడిన కేసీఆర్, అతడు తన వద్దకు వచ్చినప్పుడు సాదరంగానే ఆహ్వానించి, చివరకు రాజకీయం అంటే ఏమిటో పవన్ కు రుచి చూపించాడు. రాజకీయం చేయడం పవన్ కల్యాణ్ కే కాదు.. తనకూ తెలుసన్న సంకేతాలను ఇచ్చాడు తెలంగాణ సీఎం. ఇక పవన్ కల్యాణ్ వెళ్లి కలిశాడు కాబట్టి.. కేసీఆర్ గొప్పోడు అని నిన్నా మొన్న వాదించిన పీకే అభిమానగణం ఇప్పుడు కేసీఆర్ పై విమర్శల వాన మొదలుపెట్టడం కొసమెరుపు!