Home > Politics - Gossip
ఈ మాట వారు మోడీతో చెప్పగలరా?

రాష్ట్ర భాజపా నాయకులు ఇప్పుడు ఓ సలహా చెబుతున్నారు. ప్రతిపక్షం లేని ఏపీ అసెంబ్లీలో చిత్రమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేస్తే పోతుంది కదా.. చిటికెలో అయిపోయేదానికి నాన్చడం ఎందుకు ? అన్నట్లుగా భాజపా నేత సలహా ఇస్తున్నారు. అయితే సదరు నేత అదే సలహా కేంద్రానికి  కూడా ఇవ్వగలరా? మోడీ సర్కారుకు కూడా చెప్పగలరా? అనేది జనంలోని సందేహం. ఎందుకంటే.. ఇదే ఫిరాయింపు ఫిర్యాదులు పార్లమెంటులో కూడా పెండింగులోనే ఉన్నాయి మరి!

అనర్హత వేటులపై కాస్త నేపథ్యాన్ని పరిశీలిస్తే..

చట్టం ప్రకారం అయితే.. ‘‘ఒక పార్టీ టిక్కెట్ మీద ప్రజాప్రతినిధిగా గెలిచిన వ్యక్తి.. రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి ఫిరాయిస్తే గనుక.. తక్షణం అనర్హత కు గురవుతాడు. అయితే.. అతడిని గెలిపించిన పార్టీ వారు ఫిర్యాదు చేస్తే మాత్రం వేటు వేయాలి. కాకపోతే ఇక్కడ చిన్న మతలబు ఉంది. స్పీకరు తన విచక్షణ మేరకు, సదరు ఫిర్యాదుపై విచారణ జరిపి.. ఆ ప్రజాప్రతినిధిని పిలిచి మాట్లాడి తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు.’’ అని చట్టం చెబుతుంది.

వచ్చిన సమస్య ఏంటంటే.. స్పీకరు ఎంత గడువులోగా నిర్ణయం తీసుకోవాలి? అనేది ఎక్కడా చట్టంలో లేదు. నిజానికి అధికార పార్టీకిచెందిన వారు.. మరో పార్టీలోకి మారితే గనుక.. గంటలు రోజుల్లోనే వేటు పడిపోతుంది. ఇక్కడ అధికార పార్టీలోకి మారితే.. నిర్ణయాలు రకరకాల వేగంతో నడుస్తుంటాయి.

ఇప్పుడిక అసలు విషయానికి వస్తే.. ఏపీ అసెంబ్లీలో విపక్షం రాకపోయిన నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభన గురించి అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. అనర్హత వేటు వేసేస్తే పోతుంది కదా అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. నిర్ణయం తీసుకుంటే ఆరునెలల్లో ఎన్నికలు కూడా వచ్చేస్తాయి అంటూ సలహా ఇచ్చారు. అయితే మరో సంగతిని గమనించాలి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీ పార్టీ ఫిరాయించినందుకు లోక్ సభలో ఓ ఫిర్యాదు పెండింగులో ఉంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఎన్నికల తర్వాత.. తెదేపాలో చేరిపోగా.. అప్పట్లో వైకాపా లోక్ సభ స్పీకరుకు ఫిర్యాదు చేసింది. ఇప్పటిదాకా దాని గురించి అతీగతీ లేదు. కాకపోతే అక్కడ వైకాపాకూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఇక్కడ రాష్ట్ర సర్కారు కు చెబుతున్న సలహానే.. భాజపా నేత కేంద్రంలోని తమ మోడీ సర్కారుకు కూడా చెప్పగలరా? అని ప్రజలు తర్కించుకుంటున్నారు.