Home > Politics - Gossip
చంద్రబాబు : కన్ను కుట్టింది.. కాక పుట్టింది..!

హైదరాబాదులో పదేళ్ల పాటు రాజధానిగా వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ పాలనను సాగించగలిగిన అవకాశం ఉన్నప్పటికీ.. అధికార్లు ఎవరూ అక్కడ లేకపోయినప్పటికీ.. ఊరందరికంటె ముందు చంద్రబాబునాయుడు వెళ్లి విజయవాడలో కూర్చున్నారు. అందుకు ఆయన చెప్పుకున్న కారణాలు ఏవైనా కావొచ్చు గాక... కానీ బెజవాడకు వెళ్లారన్నది నిజం.

నెమ్మదిగా తన అధికార నివాసాన్ని ఇంద్రభవనం లాగా.. ఆక్రమణల్లో ఉన్న భవనాన్ని తీసుకుని కోట్లు ఖర్చు పెట్టి రూపుదిద్దుకున్నారు. అలాగే మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ‘తాత్కాలిక భవనాల’ పేరు మీద.. నాణ్యతలేని సచివాలయ భవనాలు, తన ఛాంబర్ కోసం మరిన్ని కోట్ల రూపాయలను హడావిడిగా ఖర్చు పెట్టించారు.

తన వైభోగం కోసం ఇన్ని భవనాలను సిద్ధం చేసుకున్న చంద్రబాబునాయుడుకు తనకు ఒక పార్టీ ఉన్నదని, ఆ పార్టీ పుణ్యమే తను ఇప్పుడు సీఎం పదవిలో ఉన్నానని, ఆ పార్టీకి విజయవాడలో కూడా ఒక సొంత కార్యాలయం అధికారికంగా ఘనంగా ఉండాలని మాత్రం స్ఫురించలేదు. పైగా ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఇప్పుడు ఆయన ఆ విషయంలో... విజయవాడకు చెందిన మంత్రి దేవినేని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ట్విస్టు చోటు చేసుకుంది. రెండురోజుల కిందటే వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడలో తమ ఏపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని చాలా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఆఫీసు చూసి.. చంద్రబాబుకు కన్ను కుట్టినట్టుగా ఉంది. పైగా వైసీపీ తాడేపల్లి లో శాశ్వత పార్టీ కార్యాలయం నిర్మించుకుంటోంది. ఈ ఆఫీసు అప్పటిదాకా పార్టీ కార్యకలాపాలకు మాత్రమే అన్నమాట. 

ఈ వైభోగం చూసి చంద్రబాబుకు కన్నుకుట్టి కాకపుట్టినట్టుగా ఉంది. అందుకే పార్టీ సమావేశంలో వైసీపీ కార్యాలయం గురించి చర్చ రాగానే... ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ పార్టీకి ఒక ఆఫీసు నిర్మించలేకపోయారంటూ దేవినేని ఉమా మీద ఆగ్రహం వెలిబుచ్చేశారు. దేవినేని తక్కువ తినలేదు.. ఇప్పటికే రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నాయని.. మీ అనుమతి కోసం చూస్తున్నామని అందరి ఎదుటే రిటార్టు ఇచ్చారు. ఏ విషయాన్నైనా తాను ఓకే చేస్తే తప్ప.. ఊరుకోని చంద్రబాబు వైఖరి కూడా ఉమా సమాధానంలో బయటపడినట్లయింది.

ఆ జవాబు నచ్చలేదేమో.. నెపం నా మీద నెడతారా అన్నట్లుగా చంద్రబాబు ఉమా మీద ఆగ్రహం వెళ్లగక్కినట్లుగా సమాచారం. మొత్తానికి పార్టీ కార్యాలయాల మీద తెదేపాలో కూడా ఒక ఊపు వచ్చినట్టే. అమరావతి లో పార్టీ కార్యాలయం సత్వరం నిర్మించాలని, చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత దీనికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలు వెంటనే పూర్తి చేయాలని అనుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇదంతా వైసీపీ ఆఫీసు పుణ్యమేనా.. అని జనంలో సెటైర్లు వినిపిస్తే ఆశ్చర్యం ఏముంది?