Home > Politics - Gossip
మోదీకి, చంద్రబాబు పాఠాలు చెబుతాడేమో?!

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. రాజకీయ ఆసక్తి ఉండే చాలా మందిలో ఒక సందేహం దోబూచులాడుతోంది.  ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చరిత్రలో నిలిచిపోయేంత ఘన విజయాన్ని సాధించడం వరకు బాగానే ఉంది... మరి ఆ రాష్ట్రంలో ఒక్క ముస్లింకు కూడా వారు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు కదా... మరి మైనారిటీ మంత్రిత్వ శాఖను ఎవరికి అప్పగిస్తారు అనేది ఆ సందేహం. ఈ సందేహానికి అనుబంధంగా సోషల్ మీడియాలో మోదీ మీద ఇప్పటికే చాలా సెటైర్లు పుట్టుకొచ్చాయి  కూడా! కానీ చాలా మందికి తెలియని సంగతి ఒకటుంది. మోదీకంటె ఎంతో సీనియర్ అయిన చంద్రబాబునాయుడు.. ఈ విషయంలో ఆయనకు పాఠాలు చెప్పే అవకాశం ఉందని కొందరు జోకులేసుకుంటున్నారు. తన కేబినెట్లో ఒక ముస్లిం కూడా లేకుండానే.. మైనారిటీ మంత్రిత్వ శాఖను కూడా నడిపిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో మోదీకి, ఆయన ద్వారా యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వారికి మార్గదర్శనం చేయగలరని జోకులు వినిపిస్తున్నాయి. 

భారతీయ జనతా పార్టీ అంటేనే ముస్లిం వ్యతిరేక ముద్ర ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియని సంగతి ఎంత మాత్రమూ కాదు! పైగా మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్ లో జరిగిన అల్లర్లు, ముస్లింలు ఎదుర్కొన్న దాడులు ఇవన్నీ ఆయనకు జీవిత కాలంలో ముస్లింల క్షమాభిక్ష దక్కదనే చెబుతాయి. అయితే చాలా తమాషాగా గతంలో గుజరాత్ ఎన్నికల్లో కూడా భాజపా విజయం సాధించినప్పుడు, ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ వారికి విజయం దక్కింది. దీనిని సాకుగా చూపి.. మోదీకి ముస్లింలలో ఆదరణ ఉన్నదని సహజంగానే భాజపా టముకు వేసుకున్నది. 

ప్రస్తుతం యూపీ ఎన్నికల్లో పరిస్థితి మరింత టూమచ్ అని చెప్పాలి. రాష్ట్రంలో ఒక్క ముస్లింకు కూడా భాజపా కనీసం టిక్కెట్ ఇవ్వలేదు. అదే సమయంలో ముస్లింల సంఖ్యే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల కూడా కమలదళానికి గెలుపు దక్కింది. ఎలా దక్కిందనే విషయంలోనే మాయావతి అనేక సందేహాలు లేవనెత్తారు. అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు భాజపా విజేతలైన ఎమ్మెల్యేల్లో మైనారిటీలకు చెందిన వారు లేరు. మరి మైనారిటీ శాఖను ఎవరికి ఇస్తారనే ప్రశ్నలు కొందరు సంధించారు. బహుశా ఇలాంటి సందేహాలు రేకెత్తిన, ప్రశ్నలు వేసిన ఉత్తరాది నేతలకు , మన చంద్రబాబు గురించి తెలిసి ఉండకపోవచ్చు. తన సర్కారులో మైనారిటీ మంత్రిత్వ శాఖను పల్లె రఘునాధరెడ్డి చేతిలో ఉంచి ఒక్క ముస్లిం కూడా కేబినెట్ లో లేకుండా.. ఆయన నెట్టుకొస్తున్న వైనం వారికి తెలియకపోవచ్చు. అందుకే బాబు గురించి తెలిసన వారు.. మోదీకి చంద్రబాబు పాఠాలు చెప్పి.. ముస్లింలను మాయ చేయడం ఎలాగో నేర్పుతారని అంటున్నారు.