Advertisement


Home > Politics - Gossip
తగ్గించిన తర్వాత డప్పు కొట్టుకోండి సార్!

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను కుదిరితే తగ్గిస్తాం తప్ప.. పెంచబోయేది మాత్రం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ప్రకటించిన మాట అంతే.. ఆ మాత్రం దానికే.. దేశంలో ఈ రకంగా చెప్పగల ఏకైక ప్రభుత్వం తమదే అని చంద్రబాబు డప్పు కొట్టుకోవడం ప్రారంభించేశారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల విషయంలో.. పెంచం అవసరమైతే తగ్గిస్తాం అని మాత్రమే ఆన చెప్పారు తప్ప.. ఇప్పటిదాకా తగ్గిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

నిజంగానే విద్యుత్తు చార్జీలను తగ్గిస్తే గనుక.. దేశంలో విద్యుత్తు చార్జీలను తగ్గించిన ఏకైక ప్రభుత్వం తమదే అని ఆయన డప్పు కొట్టుకున్నప్పటికీ.. అర్థవంతంగా ఉంటుంది. అసలేమీ లేకుండానే.. ఏదో జనాంతికంగా ఒక మాట అనేసి.. దాన్ని పట్టుకుని తమను తాము కీర్తించుకోవాలంటే ఎలాగ అని జనం అడుగుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరాది రోజున రైతులోకం మురిసిపోయేలాగా.. ఉచిత వ్యవసాయ విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేసే పథకాన్ని  ప్రారంభించి.. విపరీతమైన మైలేజీ సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి విషయంలోనూ చంద్రబాబును నెత్తిన పెట్టుకుని, ఆయన తెగ కష్టపడిపోతున్నారని కితాబులు ఇస్తూ ఉండే పవన్ కల్యాణ్ కూడా.. కేసీఆర్ తో బేటీ అయి.. ఆయనను అభినందించి.. ఆయనను దేశంలోని సీఎంలు అందరూ రోల్ మోడల్ గా తీసుకోవాలని ప్రకటించేశారు.

తన వాడైన పవన్ వెళ్లి కేసీఆర్ ను ఆ రేంజిలో పొగడడమూ... ఏపీ కూడా ఇలాంటి మంచి పనులు చేయాల్సిందిగా చెప్తానని పవన్ అనడమూ చంద్రబాబులో కొత్త ఆలోచనల కలిగించినట్లున్నాయి. ఈ సమయంలో కేసీఆర్ ను మించి.. ప్రజల్లో మైలేజీ తెచ్చుకోవాలంటే.. విద్యుత్తు ధరలను తగ్గించడం ఒక్కటే బ్రహ్మాస్త్రం అని ఆయన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ అయినా నిరంతరాయ విద్యుత్తుతో రైతులోకానికి మాత్రమే చేరువ అవుతాడని... తను ధరలు తగ్గిస్తే ఏకంగా యావత్ ప్రజలకు చేరువ కావచ్చునని చంద్రబాబు ఆలోచనగా ఉంది. దానికి సంబంధించిన కసరత్తునే జన్మభూమి సభలో బయటపెట్టారు.

అలాంటి నిర్ణయం తీసుకుంటే.. మళ్లీ పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు వచ్చి.. చంద్రబాబునాయుడు రోల్ మోడల్.. దేశంలో సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలి.. ప్రపంచంలో ప్రతిధర పెరుగుతుండడం అలవాటైన రోజుల్లో విద్యుత్తు చార్జీలను తగ్గించడం.. అత్యద్భుతం.. అంటూ కీర్తించాలనేది బహుశా చంద్రబాబు కోరిక అయిఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.