Home > Politics - Gossip
యనమల ఆబ్లిగేషన్ కు బాబు ఎదురు చెప్పలేడా?

అందరినీ చంద్రబాబునాయుడు ప్రభావితం చేస్తుంటారు. తాను చెప్పిందే వేదం అని అంటుంటారు. తాను చెప్పినదానినే అందరూ  అనుసరించాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబునాయుడును కూడా ప్రభావితం చేయగల నాయకుడు ఎవరు? తాను చెప్పినట్లు ఆడించగల, తన ఆబ్లిగేషన్ లను ఎదురుచెప్పకుండా ఆమోదించేలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగిన వారు ఎవరు? అంటే.. యనమల రామకృష్ణుడు పేరే వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఆర్థికశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న యనమల మీడియాలో ఫోకస్ కావడం తక్కువ. అయినప్పటికీ తాజా రాజకీయ పరిణామాలను, నియామకాలను గమనిస్తోంటే.. యనమల మాటకు చంద్రబాబు వద్ద తిరుగులేదని, ఆయన ఆబ్లిగేషన్ కు ఎదురుచెప్పలేరని జనం అనుకుంటున్నారు. 

ఇదంతా తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు నియామకం వ్యవహారం దగ్గర నుంచి మొదలవుతోంది. టీటీడీ ట్రస్టు బోర్డు అంటే.. రాజకీయేతర పదవులు ఆశించే అధికారపార్టీ ప్రముఖులు అత్యంత హాట్ కేక్ గా కోరుకునే నామినేటెడ్ పోస్టు! టీటీడీ మెంబరు పోస్టును ఎమ్మెల్యే పదవితో సమానంగాను, టీటీడీ ఛైర్మన్ పదవి అంటే ఇంచుమించు మంత్రిపదవితో సమానంగానూ అంతా భావిస్తుంటారు.

కేవలం టీటీడీ బోర్డులో మెంబర్ షిప్ కోసం.. ప్రధానితోను, అంతకంటె పెద్ద రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితోను రికమెండ్ చేయించుకునే వారు కూడా అనేకులు ఉంటుంటారు. దేశంలో కొమ్ములు తిరిగిన వ్యాపార దిగ్గజాలు కూడా ఒక్కసారి బోర్డు మెంబరుగా చేయాలని ఆశ పడుతుంటారు. దీనికి అంత డిమాండ్ ఉంటుంది. 

అలాంటిది రెండుసార్లు వరుసగా బోర్డు మెంబర్ పదవి ఇవ్వడం అంటే సాధారణంగా అధికార పార్టీకి అది చాలా పెద్ద ఆబ్లిగేషన్ కింద లెక్క. చాలా కొద్దిమందికి మాత్రమే అలాంటి అవకాశం దక్కింది. అయితే గత ట్రస్టు బోర్డులో మెంబర్ పదవికట్టబెట్టి.. తాజాగా అదే వ్యక్తికి ఛైర్మన్ గిరీ కట్టబెట్టడం అనేది పార్టీ వర్గాలనే విస్మయ పరుస్తోంది. కేవలం యనమల ఆబ్లిగేషన్ కారణంగానే.. ఇలాంటి నియామకానికి చంద్రబాబు తలొగ్గారని అంతా అనుకుంటున్నారు. 

కడపజిల్లాలో సుధాకర్ యాదవ్ అని ఓ నాయకుడు ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టిక్కెట్ కూడా సంపాదించుకుని.. ఓడిపోయారు. అయినా ఆ పదవితో సమానమైన టీటీడీ బోర్డు సభ్యత్వం ఆయనకు దక్కింది. తాజాగా మళ్లీ బోర్డు నియామకం అంశం తెరమీదకు వస్తున్న తరుణంలో.. సుధాకర్ యాదవ్ నే ఛైర్మన్ చేస్తారనే ప్రచారం అమరావతిలో వినిపిస్తోంది.

ఈ సుధాకర్ యాదవ్ కు అంత ప్రత్యేకమైన అర్హతలేమిటబ్బా అనుకుంటే.. ఆయన యనమల రామకృష్ణుడుకు స్వయానా వియ్యంకుడు కావడమే విశేషం. ‘బావ కళ్లలో ఆనందం చూడడమే నాకు ముఖ్యం’ అన్నట్లుగా.. బావను మంత్రి రేంజి పదవిలోనే చూడాలని యనమల అనుకున్నట్లున్నారు. అందుకే టీటీడీ ఛైర్మన్ కోసం ఎంతో మంది కొమ్ములు తిరిగిన వాళ్లు.. కుల సమీకరణాల ప్రకారం ముఖ్యమైన వాళ్లు ఒత్తిడులు తెచ్చినా సరే.. చంద్రబాబు చివరాఖరికి సుధాకర్ యాదవ్ వైపు మొగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.