Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు గ్రేట్‌నెస్‌ ఏమైపోయింది.?

అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌' (జీఈఎస్‌) హైద్రాబాద్‌లో జరుగుతోంది. సౌత్‌ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా హైద్రాబాద్‌లో ఈ సదస్సు జరుగుతుండడం గమనార్హం. దేశంలోని పలు రాష్ట్రాలు పోటీ పడితే, హైద్రాబాద్‌కి ఆ ఛాన్స్‌ దక్కింది. 1500 మందికి పైగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఈ సదస్సుకి హాజరయ్యారు. ఇందులో మహిళలు, యువతే అత్యధికం. ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా వైట్‌హౌస్‌ ప్రతినిథి ఇవాంకా ట్రంప్‌.. ఈ సదస్సుని ప్రారంభించారు. 

ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ హైద్రాబాద్‌లో జరుగుతోంటే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నట్టు.? చంద్రబాబు కోడలు బ్రాహ్మణి 'హెరిటేజ్‌' కోటాలో, సదస్సుకి హాజరయినా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ సదస్సులో 'ప్రాతినిథ్యం' లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్నా, కేంద్రం నిర్వహిస్తోన్న సదస్సు ఇది. ఆ మాటకొస్తే, ఇది అంతర్జాతీయ సదస్సు. ఆ లెక్కన, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌, 'తన అవసరాల దృష్ట్యా' ఈ సదస్సుని ప్రత్యేక కోణంలో చూసి వుండాలి. ఎటూ హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధాని గనుక, ఆ వెసులుబాటునీ ఉపయోగించుకుని వుండాలి. 

గడచిన మూడున్నరేళ్ళ కాలంలో చంద్రబాబు లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమంటూ ఆయన పదే పదే విదేశీయానం చేసి వస్తున్నారు. మరి, 150కి పైగా దేశాల నుంచి అతిథులు హైద్రాబాద్‌కి వస్తున్నప్పుడు, వారందరినీ కలిసే అవకాశాన్ని చంద్రబాబు ఎందుకు చేజార్చుకున్నారట.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. 

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందలేదనో, ఇంకోటనో.. కాకమ్మ కబుర్లు చెబితే కుదరదిక్కడ. అవసరం ఆంధ్రప్రదేశ్‌ది. ఆ లెక్కన, చంద్రబాబే తనంతట తానుగా ముందడుగు వేయాల్సి ఉంది. నిజానికి, ఈ సదస్సుని విశాఖలో నిర్వహించేలా చేయాలని చంద్రబాబు ప్రయత్నించారనీ, చంద్రబాబు పప్పులుడకలేదనీ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అదెంత నిజం.? అన్నది వేరే విషయం. 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం అహర్నిశలూ కష్టపడ్తున్నానని చెప్పుకునే చంద్రబాబు, హైద్రాబాద్‌ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకునే చంద్రబాబు.. 'జీఈఎస్‌' సదస్సు విషయంలో కనీసపాటి 'చొరవ' చూపకపోవడం ఆశ్చర్యకరమే. మిత్రపక్షం అన్న కోటాలో అయినా, బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి, ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి.. జీఈఎస్‌ సహభాగస్వామిగా అయినా ఆంధ్రప్రదేశ్‌ని నిలిపి వుంటే బావుండేదేమో.! అంత సీనే చంద్రబాబుకి వుంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి ఎప్పుడో వచ్చి వుండేది.! పబ్లిసిటీకి తప్ప, చంద్రబాబు.. చేతల్లో ఏదీ చేసి చూపించలేరనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 

'ప్రపంచ పటంలో హైద్రాబాద్‌ని నిలబెట్టాను.. హైద్రాబాద్‌ గురించి మాట్లాడితే, నా గురించి అడుగుతున్నారు..' అని చెప్పుకునే చంద్రబాబు గ్రేట్‌నెస్‌ ఏమైపోయింది.? కనీసం, అటువైపుకు కూడా చంద్రబాబు చూడలేకపోయారంటే.. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుందట.!