Home > Politics - Gossip
చంద్రబాబు హెచ్చరిక.. దేనికి సంకేతం.?

నంద్యాల ఉప ఎన్నిక వేళ, ప్రజల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. 'ప్రతిపక్షం కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.. నంద్యాల ఉప ఎన్నికను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తోంది.. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం నా దగ్గర వుంది..' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం కాక మరేమిటి.? 

నిజానికి, నంద్యాలలో ఏం జరుగుతోందో అదంతా 'సోషల్‌ మీడియా'లో వున్నది వున్నట్లుగా కన్పిస్తోంది. సాక్షి మీడియాలో వైఎస్సార్సీపీ యాంగిల్‌ కన్పిస్తోంటే, మిగతా మీడియా అంతా దాదాపు టీడీపీ యాంగిల్‌లోనే చూపిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో ఏయే పార్టీలు ఎలా డబ్బులు ఖర్చు చేస్తోన్నదీ నెటిజన్లు ఎప్పటికప్పుడు చూస్తూనే వున్నారు. సోషల్‌ మీడియాలో ఓ విషయం వైరల్‌ అయ్యాకనే, అది మీడియాకెక్కుతోందంటే నంద్యాల ఉప ఎన్నికపై సోషల్‌ మీడియా ఎంత యాక్టివ్‌గా వుందో అర్థం చేసుకోవచ్చు. 

ఇక, సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జనానికి డబ్బుల పంచుతూ కెమెరాలకు చిక్కిన వైనాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు.? వైఎస్‌ జగన్‌, చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కి వివరణ ఇచ్చుకున్న విషయం తెల్సిందే. మరి, జగన్‌ మీద అధికార పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల మాటేమిటి.? 

ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత తన మీదే వుందన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలి సరే.. ప్రభుత్వం ఏం చేస్తోందట.? కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకి కొత్తేమీ కాదు. నంద్యాల ఉప ఎన్నికల వేళ ఏ స్థాయిలో ఈ నికృష్ట రాజకీయాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తూనే వున్నాం. 

'నాకు ఓటెయ్యకపోతే, నేను వేసిన రోడ్ల మీద నడవొద్దు.. నేనిచ్చే పెన్షన్‌ తీసుకోవద్దు..' అని చంద్రబాబు నంద్యాల ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మాటేమిటి.? దళితుల్ని కించపరుస్తూ సాక్షాత్తూ మంత్రి అదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల సంగతేంటి.? ప్రజల్ని రెచ్చగొడ్తున్నదెవరు.? కించపరుస్తున్నదెవరు.? వివాదాలు సృష్టిస్తున్నదెవరు.? ముఖ్యమంత్రిగారూ కాస్తంత క్లారిటీ ఇవ్వండి ప్లీజ్‌.