Advertisement


Home > Politics - Gossip
మోకాలికీ బోడిగుండుకీ చంద్రబాబు ముడి!

తెలంగాణలో చంద్రబాబునాయుడు రెండురోజుల కిందట పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయనకు షాకుల మీద షాకులు తగిలాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో ఆయనకు బాగానే అర్థమైనట్లుగా ఉంది. అయితే ఆ తర్వాత రెండో రోజునే అమరావతిలో పార్టీ ఏపీ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. చాలామంది నాయకుల మీద చాలా కారణాల రీత్యా అసహనం ఆగ్రహం ప్రదర్శించారు. తమాషా ఏంటంటే.. తెలంగాణలో తెలుగుదేశం ఎదుర్కొంటున్న దుస్థితికి, ఏపీలో కొందరు నాయకుల వ్యవహార సరళికి ఆయన ముడిపెట్టే ప్రయత్నం చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం చెబుతున్నారంటే.. పరిటాల రవి కుమారుడి పెళ్లికి కేసీఆర్ కూడా ఒక కీలక అతిథిగా హాజరైనప్పుడు లోకల్ తెలుగుదేశం నాయకులు చాలా అత్యుత్సాహం చూపించారట. కేసీఆర్ తో రాసుకుపూసుకు తిరిగారుట. ఇది పార్టీకి చాలా నష్టదాయకమైన చర్య అట. ఇలాంటి అత్యుత్సాహాన్ని తగ్గించుకోవాలట. ఇలా చంద్రబాబు అనేక రకాల సుద్దులు చెప్పారు.

అయితే పయ్యావుల కేశవ్ – పెళ్లికి వచ్చిన కేసీఆర్ తో సన్నిహితంగా మాట్లాడడాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఆయన ఎలా అభివర్ణిస్తున్నారంటే.. కేశవ్ ఆ రకంగా కేసీఆర్ తో క్లోజ్ గా మెలగడం వల్ల... తెలంగాణలో తమ పరువు పోయిందని.. అందువల్ల తాము పార్టీకి రాజీనామా చేసేస్తాం అని తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా సమన్వయ భేటీలో చెప్పారు. 

తెలంగాణ తెలుగుదేశం నాయకులు రాజీనామా చేసేస్తాం అని చంద్రబాబుతో ఆదివారం నాడు చెప్పి ఉండవచ్చు. కానీ వారు అలాంటి ఆలోచన చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా చూసినా.. తెలుగుదేశం పార్టీ తిరిగి బతికి బట్ట కడుతుందనే సంకేతాలులేవు. భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ చిగురించే అవకాశం లేనప్పుడు ఆ పార్టీలో ఎవరు మాత్రం కొనసాగాలని కోరుకుంటారు. అలాంటి విపరీత పరిస్థితిని పార్టీ ఎదుర్కొంటోంది. అయితే.. అక్కడ వారు రాజీనామాలు చేస్తాం అనడానికి... పయ్యావుల కేశవ్ కాసేపు కేసీఆర్ తో ఏకాంతంగా మాట్లాడడానికి ముడిపెట్టడం చూస్తే.. చంద్రబాబు మోకాలికి బోడిగుండుకీ ముడిపెట్టినట్టు మాట్లాడుతున్నారని పలువురు అంటున్నారు. 

ఈ మూడేళ్లలో తెలంగాణలో అనేక మంది తెలుగుదేశం వాళ్లు రాజీనామాలు చేసేశారు. మరి వారంతా ఎందుకు వీడిపోయారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఇలా అసంబద్ధంగా లింకులు పెట్టి.. సొంత కేడర్ ను అనుమానించడం తగదని పలువురు అంటున్నారు.