Advertisement


Home > Politics - Gossip
బాబు మెచ్చిన మోడల్ కు భవిష్యత్తు లేనట్టేనా?

వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించడానికి, ప్రజారవాణాను వీలైనంత సరళతరం చేయడానికి, తద్వారా ప్రమాదాలను కూడా తగ్గించడానికి ఇలా అనేక రకాల లక్ష్యాలతో ప్రభుత్వాలు నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థను ఆశ్రయిస్తున్నాయి. అయితే చంద్రబాబునాయుడు సర్కారు నూతన రాజధాని అమరావతి, విశాఖలకు ముందుగా అనుకున్న మెట్రోరైలు బదులుగా లైట్ మెట్రో అనే పద్ధతి మీద ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. ఈ లైట్ మెట్రో ఈ నగరాలకు తగదని నిపుణులు సూచిస్తున్నారు. అమరావతి భవిష్యత్తులో ఎంతో విస్తరించే నగరం అని.. దీనికి మెట్రోనే సరైనదని ఢిల్లీ మెట్రో ఎండీ మంగూసింగ్ కూడా అంటున్నారు. 

లాభాల సంగతి పక్కన పెడితే.. ప్రజా రవాణాకు అందుబాటులో ఉండడం వరకు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థ క్లిక్ అయింది. హైదరాబాదులో కూడా మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నరకం తగ్గుతుందనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అమరావతి విశాఖ నగరాలకు కూడా మెట్రోరైలు వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకుంది. కొత్త నగరాల అభివృద్ధిలో లాభాలు రాకపోయినా సరే.. మెట్రో ఒక భాగంగా ఉండడాన్ని ఒప్పుకోవచ్చు.

దీనికి సంబంధించి.. దేశంలోనే నిపుణుడు శ్రీధరన్ ను కన్సల్టెంటుగా పెట్టుకున్నారు. కొన్నాళ్ల కసరత్తు తర్వాత అమరావతి- బెజవాడకు మెట్రో బదులుగా లైట్ మెట్రో విధానం అమల్లోకి తేవాలని శ్రీధరన్ కు సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీన్ని అవమానంగా భావించిన శ్రీధరన్ తాము కన్సల్టెంటు గా మెట్రో బాధ్యతలనుంచి తప్పుకుంటాం అని ప్రభుత్వానికి లేఖ రాసి.. తమ సిబ్బందిని కూడా ఉపసంహరించుకున్నారు. 

నిజానికి శ్రీధరన్ పక్కకు తప్పుకోవడం అనేది ప్రభుత్వానికి చాలా అవమానకరమైన సంగతి. ఆ అంశం ఎక్కడా చర్చకురాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లైట్ మెట్రో అంటూ కేవలం ఖర్చులో కొద్దిపాటి తేడా మాత్రం ఉండే వ్యవస్థను ఆశ్రయిస్తోంది. ఇది కేవలం తక్కువ రద్దీ ఉండే మార్గాలకే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అమరావతి పరిధిలో భవిష్యత్తులో కూడా రద్దీ తక్కువే ఉంటుందని ప్రభుత్వం అనుకుంటున్నదేమో తెలియదు.

ఈ ప్రాజెక్టులకే అతీగతీ లేకుండా ఉంటే మళ్లీ బుల్లెట్ రైలు అనే మరో త్రీడీ గ్రాఫిక్స్ మాయను ప్రజల ముందుంచుతోంది. అయితే ఢిల్లీ మెట్రో ఎండీ మంగూసింగ్ చెబుతున్న దాన్ని బట్టి, ఇప్పటికే పక్కకు తప్పుకున్న శ్రీధరన్ అభ్యంతరాలను బట్టి.. భవిష్యత్తు దృష్ట్యా మెట్రోనే మంచిదేమోనని, చంద్రబాబు సర్కారు ఎంచుకుంటున్న లైట్ మెట్రో తో ముందు ముందు అవసరాలు తీరవేమోనని ప్రజలు శంకిస్తున్నారు. మరి చంద్రబాబునాయుడు నిపుణుల మాట మేరకైనా తన ఆలోచనలను మార్చుకుంటారో లేదో చూడాలి.