Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు ఎత్తిన రిజర్వేషన్ల కుంపటి!

వివిధ సామాజికవర్గాల రిజర్వేషన్ల వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రోజురోజుకూ శిరోభారంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గరపడే కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కుల రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటోంది. వివిధ కులాల రిజర్వేషన్ల జాబితాలలో మార్పులు చేర్పులు చేస్తామని, మరికొన్ని కులాలను బీసీలుగా గుర్తిస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీలిచ్చారు. నేడు హామీల అమలు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితనానికి సవాల్‌గా మారింది. చంద్రబాబు ఆయా వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి హామీనిచ్చి దాదాపు నాలుగేళ్ళవుతోంది.

అయితే ఇంతవరకు ఏ ఒక్క కులానికి హామీ నెరవేరకపోవడం ఆయా కులాలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కారణమవుతోంది. బీసీలుగా గుర్తించాలన్న డిమాండ్‌తో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతున్న విషయం తెలిసిందే! మరోవైపు బీసీ కులాలు ఎన్నికల హామీలను అమలుచేయలేదంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాపులకు దీటుగా బీసీ సైతం చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వాస్తవానికి 2014 ఎన్నికల సమయంలో టీడీపీ మ్యానిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా కాపులను బేషరుతుగా బీసీలుగా గుర్తిస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం కాపులకు ఆగ్రహం కలిగించింది. దీంతో మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని రిజర్వేషన్ల కోసం పోరుబాటపట్టారు.

అనతి కాలానికే తూర్పు గోదావరిజిల్లా తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో చేపట్టిన కాపుల ఐక్యగర్జన హింసాత్మకంగా మారింది. అప్పట్లో రత్నాచల్‌ రైలు దగ్ధం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం కాపు జేఏసీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంజునాథ్‌ కమీషన్‌ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కాపులకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాలలో ప్రకటించారు.

డిసెంబర్‌ మొదటి వారంలో కాపులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని కాపునేత, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. వీరి ప్రకటనలిలా ఉంటే డిసెంబర్‌ 6వ తేదీలోగా కాపులను బీసీలగా గుర్తించని పక్షంలో తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి ఇటీవల అల్టిమేటం ఇచ్చారు. ఆరవతేదీ తర్వాత కాపు జేఏసీ తీసుకునే నిర్ణయంతో కాపుల భవిష్యత్‌ ఆధారపడి వుంటుందని స్పష్టం చేశారు.

ఈ విషయం ఆయా వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. కులాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు మాత్రమే కమీషన్‌ ఏర్పాటైందని గతంలో మంజునాథ కమీషన్‌ ప్రకటించింది. కాపులను బీసీలుగా  గుర్తించడం కమీషన్‌ నివేదిక రాగానే కాపులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చెబుతుండటం నమ్మశక్యంగా లేదని కాపు జేఏసీ భావిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీనే అమలుచేయమని అడుగుతున్నామని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని ముద్రగడ అల్టిమేటంలో పేర్కొన్నారు. కాపుల విషయం ఇలా వుంటే బీసీ కులాలు సైతం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రజకులను బీసీ-ఎ నుండి ఎస్టీలుగా గుర్తిస్తామని, గాండ్లను బీసీ-బీ నుండి ఎస్సీలుగాను, సగరలను బీసీ-డి నుండి బీసీ-ఎగాను, కురుములను బీసీ-బి నుండి ఎస్సీలుగా, వాల్మీకిలను ఎస్టీలుగా, పద్మశాలీలను బీసీ-బి నుండి బీసీ-గా, పుసల కులాన్ని బీసీ-డి నుండి బీసీ-గా గుర్తిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఏది ఏమైనా కులాల రిజర్వేషన్ల వ్యవహారం చంద్రబాబు పాలిట శాపంగా మారిందనే చెప్పాలి.