Advertisement


Home > Politics - Gossip
యనమలను లూప్ లైన్ లో పెడుతున్నారా?

ఏపీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లూప్ లైన్ లో పెడుతున్నారా? నెంబర్ టూ వంటి హోదా ఏదీ లేకపోయినప్పటికీ.. ఏపీ కేబినెట్ రాజకీయాలకు సంబంధించినంత వరకు నెంబర్ టూ కంటె తానే కీలకమైన వ్యక్తిగా ప్రతి విషయంలోనూ చక్రం తిప్పుతూ వచ్చిన యనమల రామకృష్ణుడు పట్ల ముఖ్యమంత్రి కినుకగా ఉన్నారా అంటే.. పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

అందుకే కొన్ని రోజులుగా యనమలకు చంద్రబాబు ప్రయారిటీ కూడా తగ్గించారనేది పార్టీ వర్గాల భోగట్టా. దీనికి దీటుగానే.. యనమల కూడా ఎక్కడా తగ్గడం లేదని, ఆయన కూడా అలకవహించినట్లుగానే కనిపిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మాటకొస్తే.. యనమలను చంద్రబాబు లూప్ లైన్ లోకి నెడుతున్నారా? లేదా, ఆయనే అలకతో దూరంగా మెలుగుతున్నారా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట విజయవాడలో యాదవులందరూ కలిసి కేసీఆర్ కు పాలాభిషేకం నిర్వహించారు. తన రాజధానిలో.. శ్రతు వర్గానికి చెందిన కేసీఆర్ ఇలాంటి గౌరవం దక్కడాన్ని చంద్రబాబు సహించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్లలు, కురుమలకు ప్రత్యేక  భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, వారి సంక్షేమానికి 100 కోట్లు ప్రకటించి నేపథ్యంలో ఏపీలోని యాదవులు కేసీఆర్ కు ఈరకంగా తమ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. సహజంగానే చంద్రబాబు లోని ఉడుకుమోతుతనం.. దీన్ని ఓర్వలేకపోయింది.

దానికి తగ్గట్లుగా ... తన కేబినెట్ లో తాను తో కీలకంగా నెత్తిన పెట్టుకునే యనమల రామకృష్ణుడు హస్తం కూడా ... ఈ సత్కార కార్యక్రమం నిర్వహించిన యాదవ  కుల ప్రముఖులకు ఉన్నట్లుగా చంద్రబాబుకు ఉప్పందింది. అసలే గతంలో రేవంత్ రెడ్డి పార్టీని వీడుతున్న సందర్భంలో కేసీఆర్ ద్వారా అనుచిత లబ్ధి పొందుతున్న ఏపీ నాయకుల్లో యనమల వంటి వారున్నారనే ఆరోపణలు ఒకవైపు. దానికి తగ్గట్లు యనమల తెరవెనుక ఉండి నడిపించినట్లుగా వినిపిస్తున్న  కేసీఆర్ పాలాభిషేకం తంతు ఒకవైపు ఆయనను మెలిపెట్టాయి. ఈ నేపథ్యంలో యనమల పట్ల కినుకగా ఉన్నారని సమాచారం.

దీనికి తోడు టీటీడీ బోర్డు యవ్వారం కూడా జత అయింది. యనమల ఒత్తిడి మీదనే ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు పదవి ఇవ్వడానికి సిద్ధపడ్డారనేది అందరికీ తెలుసు. అయితే దానితో పాటు యనమల తనకు రాజ్యసభ టిక్కెట్ కోసం కూడా పట్టు పడుతున్నట్లు సమాచారం. రెండు కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తే విమర్శలు తప్పవని చంద్రబాబు భయం. ఇలా కుదరదని ఆయన అంటున్నందున కూడా ఇద్దరు నాయకుల మధ్య గ్యాప్ ఏర్పడినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ... ఈ అంతరాన్ని చంద్రబాబు ఎప్పటికి పూరిస్తారో వేచిచూడాలి.