Advertisement


Home > Politics - Gossip
హోదాను జారవిడిచిన పాపం బాబుకు తెలుస్తోందా?

చంద్రబాబునాయుడు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. ఒక రాష్ట్ర సీఎం... నిదుల ప్రస్తావనతో కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాయడంలో వింతేమీ లేదు. రెగ్యులర్ గా జరిగే ప్రక్రియే కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఈ లేఖ సాంతం.. కేంద్రం ద్వారా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మాత్రమే ప్రస్తావిస్తున్న చందంగా సాగిపోయింది.

కాకపోతే.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రంలోని భాజపాతో మైత్రీబంధం కొనసాగిస్తున్న నాయకుడు గనుక.. మిత్రులతో సంయమనం పాటించాలని.. ఎన్నడూ మాట తూలరాదని తన పార్టీ అనుచరులకే నిత్యం హితబోధ చేస్తూ ఉంటారు గనుక.. ‘మీరు అన్యాయం చేస్తున్నారు’ అనే మాటను ఎక్కడా సూటిగా చెప్పకుండానే.. అలాంటి అర్థం వచ్చేలా.. చంద్రబాబు రాసిన లేఖ ఉన్నదని  పలువురు భావిస్తున్నారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావాలి.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అనాథలా ఏర్పడిన రాష్ట్రం ప్రతి చిన్న అవసరానికి కేంద్రం  ఇతర రాష్ట్రాలతో పోల్చకుండా.. ఉదారంగా సాయం చేస్తే తప్ప గట్టున పడే పరిస్థితి ఎప్పటికీ రాదు. అయితే ఈ నిధుల విషయం కొన్ని రోజల కిందట కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ఇస్తున్న నిధుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆయన తన సహజశైలిలో కర్ర విరగకుండా, పాము చావకుండా.. ఏపీ కి అవసరమైన నిధులను విదేశీ సంస్థల నుంచి రుణంగా ఇప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదని సెలవిచ్చారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవాళ దానికి రెస్పాన్స్ గా చంద్రబాబునాయుడు, విదేశీ సంస్థల రుణం కాదు.. మాకు నాబార్డు నుంచి గ్రాంట్ గా ఇప్పించండి.. అంటూ అరుణ్ జైట్లీని లేఖ ద్వారా వేడుకుంటున్నారు.

రుణానికి – గ్రాంటుకు చాలా తేడా ఉంది. గ్రాంటు రూపంలో నిధులు వస్తే తిరిగి చెల్లించే పనిలేదు. అందుకే చంద్రబాబు అలా అడుగుతున్నారు.

కనీసం ఈ లేఖ రాస్తున్న సమయంలో.. లేదా అధికార్లు తయారుచేసిన లేఖపై సంతకం పెట్టడానికి ముందు చదివే సమయంలోనైనా.. చంద్రబాబునాయుడుకు తను చేసిన పొరబాటు గుర్తుకు వచ్చిందో లేదో అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం అనే అంశాన్ని చంద్రబాబు భుజానికెత్తుకుని విపక్షాలతో కలిసి కేంద్రంపై ఒత్తిడిపెంచి ఉంటే.. పరిస్థితి ఇంకోరకంగా ఉండేది. కేంద్రంనుంచి రాష్ట్రానికి నిధులు ఇబ్బడి ముబ్బడిగా అన్నీ దాదాపుగా గ్రాంట్ల రూపంలోనే వచ్చేవి. దేనికీ కొరత ఉండేది కాదు. ఇలా ఎవ్వరినీ దేబిరించాల్సిన అగత్యం కూడా ఏర్పడేది కాదు.

కానీ.. చంద్రబాబు.. కారణాలు ఏవైనప్పటికీ.. ప్రత్యేకహోదాను చేజేతులా జారవిడిచారు. ప్రతిపక్షాలు పోరాడుతూ ఉన్నా కూడా.. అది ముగిసిపోయిన అంశం అని.. విపక్షాలు డ్రామా నడిపిస్తున్నాయని మాట్లాడుతూ.. మొత్తం ప్రజల్లో కూడా హోదా మీద స్ఫూర్తిని నాశనం చేసేశారు. ఆ తప్పిదానికి ఫలితమే.. ఇప్పుడు ఇలా.. అప్పులొద్దు గ్రాంట్లు ఇప్పించండి అంటూ బతిమాలాల్సి వస్తోంది. హోదా దక్కి ఉంటే.. హక్కుగా, ఆటోమేటిగ్గా అవన్నీ వచ్చి ఉండేవి. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని.. దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయాలని పలువురు ఆశిస్తున్నారు.