Home > Politics - Gossip
చంద్రబాబుకి అంత భయమెందుకట.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరైన పయ్యావుల కేశవ్‌ మొన్నీమధ్యనే అనంతపురం జిల్లాలో కలుసుకోవడం ఇద్దరి మధ్యా కాస్సేపు 'భేటీ' జరగడం.. ఇదంతా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమయిన విషయం విదితమే. ఆ వ్యవహారంపై చంద్రబాబు అప్పట్లోనే గుస్సా అయ్యారు. పయ్యావుల కేశవ్‌తో మాట్లాడి, చంద్రబాబు తన అక్కసుని వెల్లగక్కేయడమూ జరిగింది. అక్కడితో ఆ వివాదం సమసిపోయినట్లు లేదు.! 

తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు పార్టీ ముఖ్య నేతల వద్ద పయ్యావుల - కేసీఆర్‌ భేటీ గురించి ప్రస్తావించారట. ప్రస్తావించడమేంటి.? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేలా కేసీఆర్‌ - కేశవ్‌ భేటీ జరిగిందంటూ చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమైపోయారట. ఇంకెప్పుడూ ఇలాంటి ఘటనలు జరగకూడదంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేసే సరికి, ఆయన తీరు చూసి అంతా ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందట. 

చంద్రబాబు - కేసీఆర్‌ పైకి ఎలా విమర్శించుకున్నా, వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలుసుకుంటూనే వున్నారు. చంద్రబాబు, అమరావతి శంకుస్థాపన కోసం, స్వయంగా కేసీఆర్‌ని ఆహ్వానిస్తే, కేసీఆర్‌ తెలంగాణలో నిర్వహించిన చండీ యాగానికి చంద్రబాబుని ఆహ్వానించిన విషయం విదితమే. ఈ రెండు సందర్భాలే కాక, పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు.. ఈ క్రమంలో చాలా రాజకీయ అంశాలూ ఇద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. 

అయినాగానీ, కేసీఆర్‌ని కలిస్తే గిలిస్తే చంద్రబాబు కలవాలి తప్ప, టీడీపీలో ఇతర నేతలు కేసీఆర్‌ని కలిస్తే ఎలా.? చంద్రబాబుకి అసలే అభద్రతాభావం చాలా ఎక్కువ. అద్గదీ అసలు విషయం. పరిటాల రవిని ఒకప్పటి స్నేహితుడిగా కేసీఆర్‌ అభివర్ణించడం, పయ్యావుల కేశవ్‌తో కేసీఆర్‌ 'స్నేహపూర్వకం'గా మాట్లాడటం.. ఇవన్నీ చంద్రబాబుకి ఎక్కడో గట్టిగానే తగిలేశాయి. గట్టిగా అంటే అలా ఇలా కాదు.. ఇప్పట్లో చంద్రబాబు ఆ అసహనంలోంచి బయటకు వచ్చేలా లేనంతలా.!