Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబుని మళ్ళీ 'అదే' గెలిపిస్తుందట

2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిందన్న వాదన టీడీపీ నుంచి గట్టిగా విన్పించడం సహజమే. అందులో చాలావరకు నిజం వుంది కూడా.! ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి బంపర్‌ మెజార్టీ దక్కడం (సీట్ల పరంగా) తెల్సిన విషయమే. అందుకే, పదే పదే 'గోదావరి జిల్లాలు మమ్మల్ని గెలిపించాయి.. మా పార్టీ ఎప్పటికీ ఈ రెండు జిల్లాలకు రుణపడి వుంటుంది..' అని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. 

కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు 'హామీ' ఇవ్వడం టీడీపీకి కలిసొచ్చిందన్నది నిర్వివాదాంశం. 'అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తీరతాం..' అని ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విమర్శల్ని అప్పట్లో చంద్రబాబు తిప్పికొట్టారు. మూడున్నరేళ్ళ తర్వాత రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టేసి, పాస్‌ చేయించేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదీ ప్రతిపక్షం సభలో లేకుండానే.! 

అంతే, కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్యులు (అధికార పార్టీకి వత్తాసు పలికేవారే ఎక్కువ), చంద్రబాబుని కలిశారు, కృతజ్ఞతలు తెలిపారు. స్వీట్లు కూడా పంచేసుకున్నారు. ఏంటీ, కాపు రిజర్వేషన్‌ అమల్లోకి వచ్చేసిందని అనుకుంటున్నారా.? సందడి చూస్తే అలాగే అన్పిస్తుంది. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. రిజర్వేషన్ల తేనెతుట్టు కదిలిస్తే, ఆ తర్వాత పరిస్థితులెలా వుంటాయో ఊహించడం చాలా కష్టం. 

కాపుల్ని బీసీల్లో చేర్చే దిశగా అసెంబ్లీలో బిల్లు పాస్‌ అవగానే, ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బీసీ సంఘాలు రోడ్డెక్కాయి. ఆందోళనలు చేపట్టాయి. మరోపక్క, ఐదు శాతం కాదు.. 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే న్యాయం జరిగినట్లంటూ కాపు సామాజిక వర్గంలోనే కొందరు కొత్త పల్లవిని అందుకుంటున్నారు. ఈ గందరగోళం ఎలా వున్నా, 2019 ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గమే తమను గెలిపిస్తుందన్నది టీడీపీ గట్టి నమ్మకం. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. 

ఇక్కడో విషయం గురించి మాట్లాడుకోవాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురించి మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని అన్నారు. ఇప్పటిదాకా, ఆ రాజధాని అమరావతి 'ఉనికి' లేదాయె.. తాత్కాలిక సచివాలయం మినహాయిస్తే. ఇంకో ఏడాదిలో, ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరిగిపోతుందా.? ఛాన్సే లేదు. కానీ, 2019 ఎన్నికల్లో చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి రాజధాని గురించి మాట్లాడతారు. కాపు రిజర్వేషన్‌ వ్యవహారం కూడా అదే. 

'మేమే చేసేశాం..' అంటూ అటూ రాజధాని అమరావతి గురించీ (గ్రాఫిక్స్‌లో మళ్ళీ డిజైన్లు చూపించేసి), కాపు రిజర్వేషన్ల గురించీ (అసెంబ్లీలో పాస్‌ చేసిన బిల్లుని ప్రస్తావిస్తూ..) టీడీపీ నేతలు.. ముఖ్యంగా చంద్రబాబు హడావిడి చేయడం మామూలే. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం.. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం.. చంద్రబాబు మాటల్ని 'ఇంకోసారి' విశ్వసించే సాహసం చేస్తారా.? వేచి చూడాల్సిందే.